
UTTARAKHAND ASSEMBLY ELECTION 2022: ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే.. రాష్ట్రంలో ఉమ్మడి పౌర స్మృతి (UCC)ను అమలు చేస్తామని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే.. యూనిఫాం సివిల్ కోడ్ ను రూపొందించి, అమలు చేస్తామని తెలిపారు. ఇందు కోసం.. బీజేపీ ప్రభుత్వం ఒక ప్యానెల్‌ను ఏర్పాటు చేస్తుందని ధామి చెప్పారు.
ఫిబ్రవరి 14న జరిగే శాసన సభ ఎన్నికల ప్రచారంలో ధామి మాట్లాడుతూ.. తాను ప్రమాణం చేసిన వెంటనే..రాష్ట్రంలో యూనిఫాం సివిల్ కోడ్ యొక్క ముసాయిదాను సిద్ధం చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తాననీ, ఈ యూనిఫాం సివిల్ కోడ్ వల్ల వివాహాలు, విడాకులు, భూమి-ఆస్తి వారసత్వం వంటివాటి విషయంలో ప్రజలందరికీ సమానంగా పరిగణించేందుకు యూసీసీ దోహదపడుతుందని, వారి మత విశ్వాసంతో సంబంధం లేకుండా ఉంటుందనీ అన్నారు. ప్రస్తుతం ఈ అంశాలకు సంబంధించిన చట్టాలు ఒక్కొక్క మతానికి ఒక్కొక్క విధంగా ఉన్న సంగతి తెలిసిందే.
ఈ ప్రకటన బీజేపీ తీర్మానమనీ, నూతన బిజెపి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ హామీ నెరవేరుతుందనీ. 'దేవభూమి' సంస్కృతి, వారసత్వాన్ని చెక్కుచెదరకుండా ఉంచడం బీజేపీ ప్రధాన కర్తవ్యమనీ, దీనికి బీజేపీ కట్టుబడి ఉందని అన్నారాయన. రాష్ట్రంలో ఈ చట్టాన్ని అమలు చేయడం వల్ల .. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు పెరుగుతాయని ముఖ్యమంత్రి అన్నారు.
రాజ్యాంగ నిర్మాతల కలలు సాకారమవడానికి యూసీసీ దోహదపడుతుందన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని మరింత బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుందన్నారు. అందరి కోసం యూనిఫాం సివిల్ కోడ్ వల్ల సామాజిక సామరస్యాన్ని పెంపొందుతుందనీ, లింగ విభేదాలు లేకుండా..మహిళా సాధికారతను బలోపేతం చేస్తుందనీ, రాష్ట్రంలోని అసాధారణ సాంస్కృతిక-ఆధ్యాత్మిక గుర్తింపు, పర్యావరణాన్ని రక్షించడంలో సహాయపడుతుందని ధామి చెప్పారు. రాజ్యాంగ నిర్మాతల కలలు సాకారమవడానికి యూనిఫాం సివిల్ కోడ్ దోహదపడుతోందని, రాజ్యాంగ స్ఫూర్తిని మరింత పటిష్టం చేయడానికి ఇదోక అడుగు అనీ, పౌరులందరి యూసీసీని అమలు చేయాలని భారత రాజ్యాంగంలోని అధికరణ 44 చెప్తోందన్నారు.
ఉమ్మడి పౌర స్మృతి(యూసీసీ) పై సీఎం పుష్కర్ సింగ్ ధామి ఇచ్చిన హామీని బీజేపీ నేత అమిత్ మాలవీయ స్వాగతించారు. బీజేపీ పరిపాలనలో ఉన్న గోవా తర్వాత యూసీసీని అమలు చేయబోతున్న రెండో రాష్ట్రం ఉత్తరాఖండ్ అవుతుందని అన్నారు. ముస్లిం విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇస్తుండగా.. బీజేపీ మాత్రం సమానత్వం, సాధికారత కోసం గళమెత్తుతోందని అమిత్ మాలవీయ వివరించారు.
ఉత్తరాఖండ్‌లో ఫిబ్రవరి 14న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరగనుంది. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 70 మంది సభ్యులున్న సభలో బీజేపీ 56 సీట్లు గెలుపొందగా, కాంగ్రెస్ 11 సీట్లు గెలుచుకోగలిగింది. ఈ సారి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో వేచి చూడాలి.