పదేళ్లుగా ఆధార్‌ను అప్‌డేట్ చేయలేదా?.. అయితే తప్పనిసరిగా ఆ పని చేయాల్సిందే: యూఐడీఏఐ

By Sumanth KanukulaFirst Published Dec 25, 2022, 11:15 AM IST
Highlights

భారత్ దేశంలో నేడు ప్రతి పౌరుడు ఆధార్ కార్డును ఉపయోగిస్తున్నారు. పిల్లలకు బడిలో అడ్మిషన్ తీసుకోవడానికి, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందడానికి.. ఇలా ప్రతి ఒక్కదానికి ఆధార్ కార్డు తప్పనిసరి అయిపోయింది. 

భారత్ దేశంలో నేడు ప్రతి పౌరుడు ఆధార్ కార్డును ఉపయోగిస్తున్నారు. పిల్లలకు బడిలో అడ్మిషన్ తీసుకోవడానికి, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందడానికి.. ఇలా ప్రతి ఒక్కదానికి ఆధార్ కార్డు తప్పనిసరి అయిపోయింది. అయితే తాజాగా యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ).. ఆధార్ కార్డు అప్‌డేట్ గురించి కీలక ప్రకటన చేసింది. గత పదేళ్లుగా ఒక్కసారి కూడా ఆధార్‌ను అప్‌డేట్ చేయకపోతే.. కార్డుకు సంబంధించిన వివరాలను తప్పనిసరిగా అప్‌డేట్ చేయాలని యూఐడీఏఐ స్పష్టం చేసింది. 

10 ఏళ్ల క్రితం ఆధార్ కార్డు పొందినవారు.. వారి రికార్డులను ఎప్పుడూ అప్‌డేట్ చేయకపోతే డేటాబేస్‌లో వారి సమాచారాన్ని సవరించుకోవాలని యూఐడీఏఐ కోరింది. 
ఇందుకోసం గత నెలలోనే ఆధార్ ధ్రువీకరణ పత్రాలకు సంబంధించి అప్‌డేట్ డాక్యుమెంట్ అనే ఫీచర్‌ను యూఐడీఏఐ తీసుకొచ్చింది.  మై ఆధార్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో వ్యక్తిగత వివరాలను సంబంధించిన పత్రాలు (గుర్తింపు రుజువు, చిరునామా రుజువు) అప్‌లోడ్ చేయడం ద్వారా ఆధార్ కార్డు హోల్డర్స్.. వారి రికార్డులను అప్‌డేట్ చేసుకోవచ్చని UIDAI ఒక ప్రకటనలో తెలిపింది. సమీపంలోని ఆధార్ కేంద్రాన్ని సందర్శించడం ద్వారా కూడా రికార్డులను అప్‌డేట్ చేసుకోవచ్చని పేర్కొంది. 

‘‘ప్రస్తుత గుర్తింపు రుజువు, చిరునామా రుజువుతో ప్రజలు వారి ఆధార్‌లను అప్‌డేట్ చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది’’యూఐడీఏఐ తెలిపింది. ‘‘ఆధార్‌కు సంబంధించిన పత్రాలను నిరంతరం నవీకరించడం ద్వారా.. ప్రజలు సులభంగా జీవించగలుగుతారు. ప్రభుత్వం నుంచి అందుతున్న సేవలను మరింత మెరుగైన రీతిలో అందించడం సాధ్యమవుతుంది. కచ్చితమైన ప్రమాణీకరణను సాధ్యం చేయడంలో కూడా సహాయపడుతుంది’’ అని యూఐడీఏఐ పేర్కొంది. దీనికోసం ఈ ఏడాది నవంబర్ 9న ఆధార్ (నమోదు మరియు నవీకరణ) (పదో సవరణ) నిబంధనలు 2022 నోటిఫై చేసింది. పదేళ్లకొకసారి ఆధార్ వివరాలను అప్‌డేట్ చేసుకోవాలని కోరింది. 

ఇక, గత దశాబ్ద కాలంలో ఆధార్ నెంబర్ భారతదేశంలోని నివాసితుల ప్రత్యేక గుర్తింపు ధృవీకరణ పత్రంగా ఉద్భవించిన సంగతి తెలిసిందే. అనేక ప్రభుత్వ పథకాలు, సేవలను పొందేందుకు ప్రజలు ఆధార్ నంబర్‌ను ఉపయోగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న 319‌తో పాటు 1,100 కంటే ఎక్కువ ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు సేవలను అందించడానికి ఆధార్ ఆధారిత సంఖ్యను ఉపయోగిస్తున్నాయి. అలాగే బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు.. వంటి అనేక ఆర్థిక సంస్థలు కస్టమర్‌లను ప్రామాణీకరించడానికి, ఆన్‌బోర్డ్ చేయడానికి ఆధార్‌ను ఉపయోగిస్తాయి.

click me!