కన్నడ భాషకు అవమానం: ఇది అస్థిత్వంపై దాడి అంటూ.. గూగుల్‌పై కన్నడిగుల ఆగ్రహం

By Siva KodatiFirst Published Jun 3, 2021, 4:55 PM IST
Highlights

భారతదేశంలో భాషకు, సంస్కృతికి అత్యంత గౌరవం ఇచ్చే వారిలో కన్నడిగులు కూడా ఒకరు. తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ గతంలో ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు ఈ గడ్డ మీద జరిగాయి. 

భారతదేశంలో భాషకు, సంస్కృతికి అత్యంత గౌరవం ఇచ్చే వారిలో కన్నడిగులు కూడా ఒకరు. తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ గతంలో ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు ఈ గడ్డ మీద జరిగాయి. తాజాగా కన్నడ భాషకు అవమానం జరిగిందంటూ కన్నడిగులు ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. భారత్‌లో అత్యంత వికారమైన భాష ఏది అని గూగుల్‌లో సెర్చ్ చేస్తే కన్నడ అని చూసిప్తోంది. ఇది సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీయడంతో కన్నడిగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం తమ భాషపైనే కాదని, తమ అస్థిత్వంపై జరుగుతున్న దాడి అంటూ మండిపడ్డారు. కేవలం కన్నడిగులు మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాల, భాషల వారు కూడా గూగుల్ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఈ విషయమై బెంగళూరు సెంట్రల్ ఎంపీ పీసీ మోహన్ తన అధికారిక ట్విట్టర్ స్పందించారు. గొప్ప విజయనగర సామ్రాజ్యానికి నిలయం, విలువైన వారసత్వ సంపద కన్నడ భాష అన్నారు. కన్నడ భాషకు ప్రత్యేకమైన సంస్కృతి ఉందని... ప్రపంచంలోనే అతి పురాతనమైన భాషల్లో కన్నడ కూడా ఒకటి అని ఆయన తెలిపారు. 14వ శతాబ్దంలో జాఫ్రీ చౌసెర్ పుట్టకముందే కన్నడలో పురాణాలు ఉన్నాయని.. ఇలాంటి భాషను అవమానించినందుకు గూగుల్ క్షమాపణలు చెప్పాలి అని పీసీ మోహన్ డిమాండ్ చేశారు. మరో నెటిజెన్ కాస్త వెటకారంగా గూగుల్‌కు కౌంటరిచ్చారు. కన్నడ కంటే మంచి భాష ఏదో చెప్పాలని.. అప్పటి వరకు ఎదురు చూస్తాను అంటూ కామెంట్ పెట్టాడు. 
 

click me!