Udaipur Murder: కర్ఫ్యూ సడలింపు.. ఇంటర్నెట్ పున‌రుద్ద‌ర‌ణ‌..

By Rajesh KFirst Published Jul 3, 2022, 12:27 AM IST
Highlights

Udaipur Murder: ఉదయ్‌పూర్‌లో దర్జీ కన్హయ్య లాల్ హత్య తర్వాత ఇప్ప‌డిప్పుడే పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. ఈ క్రమంలో కర్ఫ్యూ ప్ర‌భావిత ప్రాంతాల్లో కొన్ని స‌డ‌లింపులిచ్చిన‌ట్టు జిల్లా యంత్రాంగం ప్రకటించింది. ఇదే స‌మ‌యంలో కొన్ని జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలు కూడా పునరుద్ధరించబడ్డాయి.

 

Udaipur Murder: దేశ‌వ్యాప్తంగా ఉదయపూర్ టైలర్ కన్హయ్యాలాల్ హత్య సంచ‌ల‌న సృష్టించింది. ప‌లు చోట్ల ఉద్రిక‌త్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఈ ఘ‌ట‌న‌పై నిర‌స‌న‌లు వెల్లువెత్తాయి. దీంతో ప‌లు చోట్ల కర్ఫ్యూ  విధించ‌గా.. ఇంట‌ర్ సేవ‌ల‌ను నిలిపి వేశారు. అయితే.. ఉదయ్ పూర్ లో ఇప్పుడిప్పుడే పరిస్థితులు నెమ్మదిగా సాధారణ స్థితికి వస్తున్నాయి. ఈ క్ర‌మంలో శనివారం ప‌లు చోట్ల‌ కర్ఫ్యూ నాలుగు గంటల పాటు సడలించబడింది. కొన్ని జిల్లాల్లో ఇంట‌ర్ నెట్ సేవ‌ల‌ను తిరిగి ప్రారంభించారు. 

ప్ర‌స్తుత‌ పరిస్థితుల‌ను దృష్టిలో ఉంచుకుని.. ఉదయ్‌పూర్‌లోని కర్ఫ్యూ ప్రభావిత ప్రాంతాల్లో ఆదివారం 10 గంటల పాటు సడలిస్తున్నట్లు జిల్లా యంత్రాంగం ప్రకటించింది. రాజస్థాన్‌లోని కొన్ని జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలు కూడా పునరుద్ధరించబడిన‌ట్టు పేర్కొంది. కానీ, ఉద‌య్ పూర్ లో మొబైల్ ఇంటర్నెట్ సేవలు మాత్రం ఇంకా అప్‌డేట్ చేయ‌లేదు. అలానే నిలిపివేయబడ్డాయి. 

ఉద‌య్ పూర్ దారుణ హ‌త్య త‌రువాత రాజ‌స్థాన్ లోని ఏడు పోలీస్ స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూ విధించబడింది(ధన్ మండి, ఘంటా ఘర్, హాతీ పోల్, అంబా మాతా, సూరజ్ పోల్, భూపాల్‌పురా, సవినా). అయితే.. ఉదయపూర్ ఇప్పుడిప్పుడే ప‌రిస్థితులు సాధారణ స్థితికి చేరుకోవడంతో, జిల్లా యంత్రాంగం.. ఆదివారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కర్ఫ్యూలో సడలింపును ప్రకటించింది. ఇదే స‌మ‌యంలో అజ్మీర్, జుంజును, బార్మర్, బికనీర్, జోధ్‌పూర్ జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించబడ్డాయి.

ఈ సంద‌ర్భంగా ఉదయ్‌పూర్ జిల్లా కలెక్టర్ తారా చంద్ మీనా మీడియాతో మాట్లాడుతూ.. 'కర్ఫ్యూ ప్రభావిత ప్రాంతాలను శనివారం మ‌ధ్యాహ్నం 12 గంటల నుండి 4 గంటల వరకు సడలించిన‌ట్టు.. అలాగే ఆదివారం ప‌ది గంట‌ల పాటు.. అంటే.. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆంక్షలు సడలించిన‌ట్టు తెలిపారు. రాష్ట్ర పరిస్థితిని సమీక్షించిన తర్వాత కర్ఫ్యూ సడలింపు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. శుక్రవారం జగన్నాథ రథయాత్ర శాంతియుతంగా జరిగిన‌ అనంతరం కర్ఫ్యూ సడలింపుపై ప్ర‌భుత్వం  నిర్ణయం తీసుకుంద‌నీ,  రథయాత్రలో వేలాది మంది పాల్గొన్నారని తెలిపారు.

 ప్రవక్త ముహమ్మద్‌పై  బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ సోషల్ మీడియాలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యకు మద్దతు ఇచ్చిన దర్జీ కన్హయ్యలాల్‌ను ఇద్దరు వ్యక్తులు అత్యంత కిరాతంగా హత్య చేశారు. పైగా హ‌త్య తామే చేసిన‌ట్టు ప్ర‌క‌టిస్తూ.. సోష‌ల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేశారు. అందులో వారు హత్య గురించి గొప్పగా చెప్పుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకుంటారని బెదిరించారు.దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్త‌త వాతావ‌ర‌ణం నెల‌కొంది. ప‌లు జిల్లాల్లో నిర‌స‌న కార్య‌క్ర‌మాలు వెల్లువెత్తాయి. 

రాజ్‌సమంద్‌లోని భీమ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో జరిగిన ఘ‌ట‌న‌లో ..  హంతకులిద్దరూ కొన్ని గంటల్లోనే   అరెస్ట్ అయ్యారు. టైలర్ కన్హయ్యాలాల్ దుకాణంపై దాడి చేసి హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలపై గురువారం మరో ఇద్దరిని అరెస్టు చేశారు. నలుగురు నిందితులు ఎన్ఐఏ కస్టడీలో ఉన్నారు. 

నిందితులకు 10 రోజుల రిమాండ్ 

కన్హయ్య లాల్ హత్య కేసులో అరెస్టయిన నలుగురు నిందితులను ఎన్‌ఐ కోర్టు 10 రోజుల రిమాండ్‌కు పంపింది. ఈ సందర్భంగా హత్యకు సంబంధించి ఎన్‌ఐఏ  వారిని మరిన్ని ప్రశ్నలు అడగనుంది. ఇంతకు ముందు ఈ విషయం రాజస్థాన్ పోలీసుల వద్ద ఉంది. వీరి డిమాండ్ మేరకు కోర్టు నిందితులను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. ఆ తర్వాత కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించారు. నిందితులను ఎన్‌ఐఏ కోర్టులో ఎన్‌ఐఏ హాజరుపరిచారు. 

హంతకులకు పాకిస్థాన్‌తో సంబంధాలు 

శుక్రవారం తెల్లవారుజామున నిందితులు గౌస్‌ మహ్మద్‌, రియాజ్‌ జబ్బార్‌ బైక్‌పై నడుస్తున్న దృశ్యాల సీసీటీవీ ఫుటేజీ బయటపడింది. నిందుతుల‌ బైక్ రిజిస్ట్రేషన్ నంబర్ 2611, ఇది ముంబైలో జరిగిన ఉగ్రవాద దాడితో ముడిపడి ఉంది. హత్య అనంతరం మార్కెట్‌లో కలకలం రేగినట్లు ఫుటేజీల్లో స్పష్టంగా కనిపిస్తోంది. వెంటనే దుకాణాలను మూసివేశారు. ఈ విషయానికి సంబంధించి, ఉదయపూర్ హత్యకు పాకిస్తాన్‌తో సంబంధం ఉందని ATS వాదిస్తోంది, ఎందుకంటే గౌస్ మహ్మద్ పాకిస్తాన్‌లో ఉన్న‌ సల్మాన్ హైదర్, అబూ ఇబ్రహీంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు విచార‌ణ‌లో తెలింది.

click me!