ఉదయ్‌పూర్ తర్వాత మహారాష్ట్రలో మరో మర్డర్.. నుపుర్ శర్మపై సోషల్ మీడియాలో పోస్టు వల్లే?

By Mahesh KFirst Published Jul 2, 2022, 2:36 PM IST
Highlights

నుపుర్ శర్మ వ్యాఖ్యలను సమర్థించిన రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌కు చెందిన ఓ టైలర్‌ను దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనను మరువక ముందే ఇదే తరహాలో మరో హత్య మహారాష్ట్రలో జరిగినట్టు తెలిసింది. అమరావతికి చెందిన ఓ మెడికల్ షాప్ ఓనర్ నుపుర్ శర్మ వ్యాఖ్యలను సమర్థించే పోస్టును కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశాడు. ఆ తర్వాతే కొందరు దుండగులు కత్తితో పొడిచి చంపేసినట్టు తెలుస్తున్నది.

ముంబయి: మొహమ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు దేశంలోనే కాదు.. ఇతర దేశాల్లోనూ తీవ్ర ప్రకంపనలు సృష్టించాయి. మన దేశంలోనే తీవ్ర ఆందోళనలు జరిగాయి. కొన్ని చోట్ల అవి హింసాత్మకంగానూ మారాయి. ఇటీవలే నుపుర్ శర్మను సమర్థిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన ఉదయ్‌పూర్‌లోని ఓ టైలర్‌ను నరికి చంపిన ఘటన కలకలం రేపింది. రాజస్తాన్‌లో జరిగిన ఈ ఘటన ఇంకా మరువక ముందే మహారాష్ట్రలోనూ ఇలాంటి ఘటనే జరిగినట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

నుపుర్ శర్మ వ్యాఖ్యలను సమర్థిస్తూ వాట్సాప్ గ్రూపుల్లో పోస్టు షేర్ చేసిన మహారాష్ట్రకు చెందిన కెమిస్ట్‌ను కత్తితో నరికి చంపారు. ఆ కెమిస్ట్ హత్యకు సంబంధించి స్థానిక బీజేపీ నేతలు పోలీసులకు లేఖ అందించినట్టు ఇండియా టుడే కథనం పేర్కొంది. ఈ ఘటన జూన్ 21వ తేదీన మహారాష్ట్రలోని అమరావతిలో జరిగింది.

54 ఏళ్ల ఉమేశ్ ప్రహ్లాద్ రావు కొల్హే అమరావతిలో ఓ మెడికల్ షాప్ నడుపుతున్నాడు. ఆయన నుపుర్ శర్మ వ్యాఖ్యలను సమర్థిస్తూ వాట్సాప్ గ్రూపుల్లో ఓ పోస్టు షేర్ చేశాడు. అయితే, ఆయన అనుకోకుండా ఆ పోస్టును కొందరు ముస్లిం సభ్యులూ, తన కస్టమర్లూ ఉండే గ్రూపులోనే షేర్ చేసినట్టు కొత్వాలి పోలీసు స్టేషన్‌కు చెందిన ఓ అధికారి తెలిపారు. 

ఆ తర్వాత కెమిస్ట్ ఉమేశ్ ప్రహ్లాద్ రావు కొల్హే హత్య జరిగినట్టు స్థానిక బీజేపీ నేతలు ఆరోపించారు. ప్రతీకారం తీర్చుకోవాలనే, అందరికీ ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాలనే ఈ హత్య జరిగినట్టు పోలీసులకు ఇచ్చిన లేఖలో వారు పేర్కొన్నారు. కాగా, ఈ హత్య వెనుక ఉగ్రకుట్ర కోణం ఏమైనా ఉన్నదా? అని ఏటీఎస్ టీమ్ రంగంలోకి దిగింది. ఉదయ్‌పూర్ హత్యకు, ఈ ఘటనకు ఏమైనా పోలికలు ఉన్నాయా? అనేది పరిశోధించనుంది.

ఈ ఘటన జున్ 21న రాత్రి 10 నుంచి 10.30 గంటల ప్రాంతంలో జరిగినట్టు తెలుస్తున్నది. ఆ రోజు ఎప్పటిలాగే ఉమేశ్ ప్రహ్లాద్ రావు కొల్హే తన మెడికల్ షాప్ మూసేసి ఇంటికి బయల్దేరాడు. షాప్ మూసేసి తన బైక్‌పై ఇంటికి బయల్దేరాడు. ఆయనతోపాటు మరో బైక్‌పై ఆయన భార్య వైష్ణవి, వారి కుమారుడు సంకేత్ (27) బయల్దేరారు.

వారు తమ ఇంటికి వెళ్లుతుండగా మహిళా కాలేజీ గేటు సమీపించిన తర్వాత ఇద్దరు దుండగులు వెనక నుంచి బైక్ పై వచ్చి వారిని అడ్డుకున్నట్టు అధికారి తెలిపారు. ఆ బైక్ పై నుంచి ఓ యువకుడు దిగి కత్తితో కొల్హే మెడ వెనక వైపును పొడిచినట్టు వివరించారు. ఆ వెంటనే స్పాట్ నుంచి పారిపోయినట్టు పేర్కొన్నారు. ఉమేశ్ ప్రహ్లాద్ రావు కొల్హే రోడ్డుపైనే కుప్పకూలిపోయాడు. సంకేత్ వెంటనే ఆయనను హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు. అక్కడే ఉమేశ్ ప్రహ్లాద్ రావు కొల్హే మరణించినట్టు వివరించారు.

ఉమేశ్ ప్రహ్లాద్ రావు కొల్హేను హత్య చేయడానికి వాడిని కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఆ ఘటన పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీని సేకరించారు.

click me!