20 ఏళ్లు యాక్టివ్‌గా ఉన్న లష్కర్ టెర్రరిస్టు హతం.. బారాముల్లాలో ఎన్‌కౌంటర్

Published : Apr 21, 2022, 06:32 PM IST
20 ఏళ్లు యాక్టివ్‌గా ఉన్న లష్కర్ టెర్రరిస్టు హతం.. బారాముల్లాలో ఎన్‌కౌంటర్

సారాంశం

జమ్ము కశ్మీర్‌లో 20 ఏళ్లుగా అనేకమార్లు ఎన్‌కౌంటర్ నుంచి తప్పించుకు బతుకుతున్న ఓ లష్కరే తోయిబా ఉగ్రవాదిని బలగాలు ఈ రోజు మట్టుబెట్టాయి. బారాముల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారు. అందులో 20 ఏళ్ల దీర్ఘకాలంగా కొనసాగుతున్న టెర్రరిస్టును హతమార్చడం విజయంగా పోలీసులు చెబుతున్నారు.  

శ్రీనగర్: జమ్ము కశ్మీర్ బారాముల్లాలో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఇందులో ఓ టెర్రరిస్టు 20 ఏళ్లుగా అనేక ఎన్‌కౌంటర్ల నుంచి తప్పించుకున్నాడు. యాక్టివ్‌గా కొనసాగాడు. రెండు దశాబ్దాలుగా లష్కరే తోయిబాతో సంబంధాన్ని కొనసాగించిన ఆ టెర్రరిస్టు ఈ రోజు ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు.

ఉత్తర కశ్మీర్‌లో బారాముల్లాలోని మాల్వా ఏరియాలో కొందరు ఉగ్రవాదులు తలదాచుకున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. ఈ సమాచారం అందగానే జమ్ము కశ్మీర్ పోలీసులు, ఆర్మీ సంయుక్తంగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ ఆపరేషన్ చేపడుతుండగా తొలుత ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఎదురు కాల్పులు చేపట్టారు.

ఈ కాల్పుల్లో ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. ఇందులో 20 ఏళ్లుగా అంటే సుదీర్ఘకాలంగా మనుగడ సాధిస్తున్న ఉగ్రవాది మొహమ్మద్ యూసుఫ్ కంట్రూ ఉన్నాడు. అనేక మంది పౌరులు, భద్రతా బలగాలపై దాడుల్లో కంట్రూ ప్రమేయం ఉన్నది. అంతేకాదు, ఇటీవలే జమ్ము కశ్మీర్ బుడ్గాం జిల్లాలో పోలీసు ఎస్పీవో, ఆయన సోదరుడు, ఓ ఆర్మీ జవాను, మరో పౌరుడిని పొట్టనబెట్టుకున్న ఉన్మాదంలో కంట్రూ ప్రమేయం ఉన్నదని ఐజీపీ కశ్మీర్ విజయ్ కుమార్ తెలిపారు. 

మొహమ్మద్ యూసుఫ్ కంట్రూ భద్రతా బలగాల గొప్ప సక్సెస్ అని వివరించారు. 2000 నుంచి మొహమ్మద్ యూసుఫ్ కంట్రూ ఉగ్రవాద సంస్థతో మమేకమై ఉన్నట్టు తెలిపారు. రెండు దశాబ్దాలుగా అనేక మార్లు ఆయన చావు నుంచి తప్పించుకున్నాడని వివరించారు. చివరిసారిగా ఆయన 2017లో మళ్లీ యాక్టివ్‌గా మారాడు. కంట్రూతోపాటు మరో స్థానిక ఉగ్రవాది ఈ ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. అంతేకాదు, ఎన్‌కౌంటర్ ఇంకా జరుగుతున్నదని, ఈ ప్రాంతంలో మరికొంత మంది టెర్రరిస్టులు దాగి ఉండొచ్చని విజయ్ కుమార్ వివరించారు. 

బారాముల్లాలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించగానే నలుగుర జవాన్లు, ఒక పౌరుడికి గాయాలయ్యాయని తెలిపారు.

జమ్ము కశ్మీర్‌లో ఈ ఏడాది జనవరి నుంచి ఇది 38వ యాంటీ టెర్రర్ ఆపరేషన్. కశ్మీర్ లోయలో చేపట్టిన ఈ ఆపరేషన్‌లలో ఇప్పటి వరకు 53 మంది టెర్రరిస్టులు మరణించారు. కాగా, 27 మంది యాక్టివ్ టెర్రరిస్టులను, 169 మంది టెర్రరిస్టులతో అసోసియేట్ అయినవారిని అరెస్టు చేశారు.

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం