టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానంలో ప్రయాణికుడికి అస్వ‌స్థ‌త‌.. కోల్‌కతాలో ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్..

By Rajesh KarampooriFirst Published Oct 6, 2022, 11:25 PM IST
Highlights

ఇస్తాంబుల్‌ నుంచి సింగపూర్‌కు వెళ్తున్న టర్కీ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో 69 ఏళ్ల వృద్ద‌ ప్రయాణికుడు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో గురువారం కలకత్తా విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ అయ్యింది. వృద్ధ ప్రయాణీకుడు మూర్ఛలతో బాధపడ్డాడు. అలాగే.. ముక్కు, నోటి నుండి రక్తం కార‌డంతో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది.

ప్ర‌యాణీకుడికి అస్వ‌స్థ‌త‌.. కోల్‌కతాలో టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానం ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్.ఇస్తాంబుల్ నుంచి సింగపూర్ వెళ్తున్న టర్కీ ఎయిర్‌లైన్స్ విమానం గురువారం కోల్‌కతా విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ప్రయాణ స‌మ‌యంలో ఓ 69 ఏళ్ల ప్రయాణికుడి ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించడంతో విమానాన్ని కోల్‌కతాలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఆ ప్రయాణీకుడు అనియంత్రిత కండరాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడని, అతని ముక్కు, నోటి నుండి రక్తస్రావం అవుతున్నట్లు ఒక అధికారి తెలిపారు.

ప్రయాణికుడి పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానం TK-054 పైలట్ కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు అధికారి తెలిపారు. 

ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) నుండి అనుమతి పొందిన తర్వాత విమానం ఉదయం 11:45 గంటలకు విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యింది. అస్వస్థతకు గురైన ప్రయాణికుడికి మొదట విమానాశ్రయంలో చికిత్స అందించి, తరువాత ఆసుపత్రికి తరలించినట్లు అధికారి తెలిపారు. మధ్యాహ్నం 2.30 గంటలకు మిగతా ప్రయాణికులందరితో విమానం మళ్లీ సింగపూర్‌కు బయలుదేరింద‌ని తెలిపారు. అదే సమయంలో అస్వస్థతకు గురైన ప్రయాణికుడికి కోల్‌కతాలోనే చికిత్స అందిస్తున్నారు.

click me!