తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిఎస్‌ఆర్‌టిసి) నుంచి ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్ (ఒజిఎల్)కు 550 విద్యుత్ బస్సుల భారీ ఆర్డర్ లభించింది. మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఇఐఎల్)కు చెందిన ఒజిఎల్ 500 ఇంట్రాసిటీ, 50 ఇంటర్సిటీ బస్సులను సరఫరా చేయనుంది.
TSRTC: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) సంచలన నిర్ణయం తీసుకుంది. మేఘా ఇంజినీరింగ్ , ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL)ల అనుబంధ సంస్థ అయిన ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్ (Olectra Greentech Limited) కు భారీ సంఖ్యలో ఆర్డర్ ఇచ్చింది. ఏక కాలంలో 550 ఎలక్ట్రిక్ బస్సులను ఆర్డర్ చేసింది. పెద్ద ఎత్తున క్లీన్, గ్రీన్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్‌ను కలిగి ఉండే దిశగా తెలంగాణ ఎలక్ట్రిక్ మొబిలిటీ చొరవ కోసం ఈ ఆర్డర్ ముఖ్యమైన దశగా పరిగణించబడుతుంది. మొత్తంగా ఒకేసారి 550 ఎలక్ట్రిక్ బస్సులకు టీఎస్ఆర్టీసీ ఆర్డర్ ఇవ్వడం సంచలం నిర్ణయంగా చెప్పవచ్చు.
పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా విద్యుత్ బస్సులను తీసుకుంటున్నామనీ, త్వరలో మరిన్ని బస్సులను తీసుకరావాలని నిర్ణయించామని టిఎస్‌ఆర్‌టిసి ఛైర్మన్, ఎంఎల్‌ఎ బాజీరెడ్డి గోవర్థన్ రెడ్డి తెలిపారు. వచ్చే రెండేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 3,400 విద్యుత్ బస్సులను అందుబాటులోకి తీసుకరావాలని భావిస్తున్నట్టు తెలిపారు. అలాగే.. టిఎస్‌ఆర్‌టిసి ఎండి విసి సజ్జనార్ మాట్లాడుతూ.. మార్చి 2025 నాటికి హైదరాబాద్ అంతటా విద్యుత్ బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని సంస్థ భావిస్తోందనీ, తొలి దశలో 550 ఈ-బస్సులను గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ (జిసిసి) పద్ధతిలో తీసుకుంటున్నామనీ, ఈ బస్సులు విడతల వారీగా అందుబాటులోకి వస్తాయని సజ్జనార్ తెలిపారు.
ఇక, ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్ సీఎండీ కేవీ ప్రదీప్ మాట్లాడుతూ.. స్థిరమైన, బలమైన రవాణా వ్యవస్థను అందించడం తమ ద్యేయమని, టిఎస్‌ఆర్‌టిసితో కలిసి పనిచేసేందుకు మరోసారి అవకాశం వచ్చినందుకు తాము గర్విస్తున్నామని తెలిపారు. ఎలక్రిక్ బస్సులు ధ్వని, వాయు కాలుష్యాన్ని గణనీయంగా తగ్గిస్తాయనీ, ప్రయాణికులకు స్వచ్ఛమైన, సురక్షితమైన ప్రయాణాన్ని అందిస్తామని కెవి ప్రదీప్ వెల్లడించారు.
మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఇఐఎల్)కు చెందిన ఒజిఎల్ 500 ఇంట్రాసిటీ, 50 ఇంటర్సిటీ బస్సులను సరఫరా చేయనున్న, ఈ ఆర్డర్ దక్షిణ భారతదేశంలోనే తమకు అతి పెద్దదని ఒజిఎల్ సిఎండి కెవి ప్రదీప్ తెలిపారు. మార్చి 2019లో టిఎస్‌ఆర్‌టిసి 40 ఎలక్ట్రిక్ బస్సులను ఆర్డర్ చేసినట్టు తెలిపారు. ప్రస్తుతం ఈ బస్సులు విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో సేవలందిస్తున్నాయన్నారు. నాలుగేళ్ల తర్వాత మరోసారి భారీ ఆర్డర్ దక్కిందన్నారు.
ఒలెక్ట్రా బస్సుల నిర్వహణ కోసం టిఎస్‌ఆర్‌టిసి జంటనగరాల్లోని దిల్‌సుఖ్‌నగర్, హయత్‌నగర్, జీడిమెట్ల, మియాపూర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్లలోని డిపోలలో ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. ఎసి ఇంటర్ సిటీ కోచ్ విద్యుత్ బస్సులు హైదరాబాద్, విజయవాడ మధ్య తిరుగుతాయి. ఇంటర్‌సిటీ కోచ్ ఈ-బస్సులను ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే.. 325 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించగలవు. ఇవి హైదరాబాద్ మరియు విజయవాడ మధ్య తిరుగుతాయి. ఈ బస్సులతో ఆర్టీసీ నిర్వహణ ఖర్చులు చాలా వరకు తగ్గుతాయి. మొత్తానికి ఒకేసారి 550 ఎలక్ట్రిక్ బస్సులను ఆర్డర్ ఇవ్వడం సంచలం నిర్ణయమేనని చెప్పాలి.