Alt News Co-Founder's Arrest: "ఎల్ల‌ప్పుడూ సత్యమే విజయం సాధిస్తుంది': రాహుల్ గాంధీ

By Rajesh KFirst Published Jun 28, 2022, 1:19 AM IST
Highlights

Alt News Co-Founder's Arrest: ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహ్మద్ జుబేర్‌ను అరెస్టు చేయ‌డంపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ స్పందించారు. సత్యం ప‌లికే ఒక గొంతును అరెస్టు చేస్తే.. మరో వెయ్యి గొంతుకలు పుట్టుకొస్తాయ‌ని అన్నారు.మతపరమైన మనోభావాలను దెబ్బతీసే పోస్టులు చేశార‌ని మహ్మద్ జుబేర్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.
 

Alt News Co-Founder's Arrest: Alt News సహ వ్యవస్థాపకుడు, జ‌ర్న‌లిస్ట్ మహ్మద్ జుబైర్ ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేయడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. బీజేపీ తీరుపై మండిప‌డ్డారు. బీజేపీ ద్వేషాన్ని, మతోన్మాదాన్ని, అబద్ధాలను బయటపెట్టే ప్రతి వ్యక్తి వారికి ముప్పేనని భావిస్తార‌నీ, సత్యాన్ని చాటే ఒక గొంతుకను నిర్బంధిస్తే.., అలాంటి మ‌రో వెయ్యి గొంతుకలు పుట్టుకొస్తాయ‌ని అన్నారు. #DaroMat" అనే హ్యాష్‌ట్యాగ్‌ని ఉపయోగించి, "నిరంకుశత్వంపై సత్యం ఎల్లప్పుడూ విజయం సాధిస్తుంది"అని  రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. 

Every person exposing BJP's hate, bigotry and lies is a threat to them.

Arresting one voice of truth will only give rise to a thousand more.

Truth ALWAYS triumphs over tyranny. pic.twitter.com/hIUuxfvq6s

— Rahul Gandhi (@RahulGandhi)

అరెస్టయిన జర్నలిస్టు జుబైర్ కు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ కూడా మద్దతు తెలిపారు.ఆల్ట్‌న్యూస్.. బీజేపీ బూటకపు క్లెయిమ్‌లను బహిర్గతం చేయడంలో ముందంజలో ఉంద‌నీ, అతనిపై ప్రతీకారం తీర్చుకోవ‌డానికే అరెస్టు చేశారని ఆరోపించారు. వృత్తి నైపుణ్యం, స్వాతంత్య్రం గురించి చాలా కాలంగా ఎటువంటి ప్రలోభాలను గురి కాకుండా ప‌ని చేశార‌ని తెలిపారు. 

జర్నలిస్టు జుబైర్ పై అరెస్టుపై లోక్‌సభ కాంగ్రెస్ విప్ మాణికం ఠాగూర్ స్పందించారు. జర్నలిస్టు జుబైర్ ను వెంటనే విడుదల చేయాలని మాణికం ఠాగూర్ డిమాండ్ చేశారు. 2014 తర్వాత.. భారతదేశంలోని నిండిపోయిన త‌ప్పుడు స‌మాచారంలో వాస్తవాల‌ను వెలికి తీయ‌డంతో @AltNews ముఖ్య భూమిక పోషిస్తుంద‌నీ, అసత్యాలతో నిండిన మా పోస్ట్-ట్రూత్ రాజకీయ వాతావరణంలో ముఖ్యమైన సేవలందిస్తుంద‌ని మాణికం ఠాగూర్ అన్నారు. అమిత్ షా ఆధ్వర్యంలో ఢిల్లీ పోలీసులు జర్నలిస్టు జుబైర్ ను అరెస్టు చేసి..తప్పిదం చేయార‌నీ, అతన్ని వెంటనే విడుదల చేయాలని ట్వీట్ చేశారు.

జుబేర్ అరెస్ట్ పై టీఎంసీ ఎంపీ ఓబ్రెయిన్ స్పందించారు. ప్రపంచంలోని అత్యుత్తమ జర్నలిస్టుల్లో ఒకరైన మహ్మద్ జుబేర్  అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.  ప్రతి రోజూ బీజేపీ ఫేక్ న్యూస్ ను జుబేర్ ప్రపంచానికి బహిర్గతం చేస్తున్నాడని ఓబ్రెయిన్ చెప్పారు.జుబేర్ అరెస్ట్ ను కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఖండించారు. సత్యంపై దాడిగా ఆయన అభివర్ణించారు. 

ఒక వర్గం ప్రజలను రెచ్చగొట్టేలా, మతపరమైన వ్యాఖ్యలు చేశాడంటూ మహ్మద్ జుబైర్ ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. జుబైర్ పై 153, 295ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మత సామరస్యానికి విఘాతం కలిగించే ట్వీట్ల గురించి ట్విట్టర్ హ్యాండిల్ పై పోలీసులను అప్రమత్తం చేయడంతో జుబేర్ ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. 

2020 నాటి కేసులో ఆయనను ప్రశ్నించడానికి ఇవాళ పిలిపించారు. స్పెషల్ సెల్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసు దర్యాప్తు సమయంలో మహ్మద్ జుబేర్ మత సామరస్యానికి విఘాతం కల్గించేలా ట్వీట్లు చేశారని ఆధారాలు లభించడంతో  పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని రిమాండ్ కోసం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తున్నట్టుగా పోలీసులు చెప్పారు.కొన్ని ట్వీట్లను ఇప్పటికే డిలీట్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. 

click me!