20 మంది రైతులతో బ్రిడ్జీ పై నుంచి నదిలో పడ్డ ట్రాక్టర్.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

By Mahesh KFirst Published Aug 27, 2022, 5:22 PM IST
Highlights

ఉత్తరప్రదేశ్‌లో ఓ దారుణం జరిగింది. వ్యవసాయ మార్కెట్‌లో పంట అమ్మిన తర్వాత రైతులను ఇంటికి తీసుకెళ్లుతున్న ట్రాక్టర్ ప్రమాదవశాత్తు బ్రిడ్జీ పై నుంచి నదిలో పడిపోయింది. ఈ ఘటన హర్దోయ్‌లో ఈ రోజు ఉదయం చోటుచేసుకుంది.

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో విషాదం చోటుచేసుకుంది. సుమారు 20 మంది రైతులతో ప్రయాణిస్తున్న ఓ ట్రాక్టర్ ట్రాలీ అదుపు తప్పి ఓ బ్రిడ్జీ పై నుంచి నదిలో పడిపోయింది. ఇందులో 13 మంది రైతులు ఈత కొట్టుకుంటూ బయటపడ్డారు. అయితే, మిగతా వారి ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉన్నది. ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్‌లో ఈ రోజు ఉదయం చోటుచేసుకుంది.

హర్దోయ్‌లో కొందరు రైతులు తమ సమీపంలోని వ్యవసాయ మార్కెట్‌కు వెళ్లారు. వారు పండించిన కీర దోస కాయలను అమ్మేశారు. అనంతరం తిరిగి తమ స్వగ్రామానికి ప్రయాణం కట్టారు. పాలి ఏరియాకు చేరుకున్న తర్వాత గర్రా నది మీదుగా కట్టిన వంతెన మీద దుర్ఘటన చోటుచేసుకుంది.

ఆ బ్రిడ్జీ పై నుంచి ట్రాక్టర్ వెళుతుండగా ఓ టైర్ ఊడి వచ్చింది. దీంతో వేగంగా వెళుతున్న ఆ ట్రాక్టర్ అదుపు తప్పింది. బ్రిడ్జీ రెయిలింగ్‌ను ధ్వంసం చేస్తూ నదిలో పడిపోయింది. ట్రాక్టర్ తో పాటు ట్రాలీ కూడా ఆ నీటిలో పడిపోయినట్టు ప్రత్యక్ష సాక్షి శ్యామ్ సింగ్ వివరించారు.

విషయం తెలియగానే జిల్లా మెజిస్ట్రేట్ అవినాశ్ కుమార్ స్పాట్‌కు చేరుకున్నారు. నీటిలో పడ్డ తర్వాత 13 మంది ఈత కొట్టుకుంటూ బయటకు వచ్చారు. వారు తమతో పాటే ట్రాక్టర్‌లో ప్రయాణించిన మరో ఆరుగురు రైతులను పేర్కొన్నారు. కానీ, వారు కనిపించలేదు. కానీ, ఆ ట్రాక్టర్‌లో మొత్తం సుమారు రెండు డజన్ల మంది ప్రయాణించామని వివరించారని జిల్లా మెజిస్ట్రేట్ అవినాశ్ కుమార్ తెలిపారు. అంటే నదిలో తప్పిపోయిన వారి సంఖ్య సుమారు పది మందిగా ఉండొచ్చు.

తాము గజ ఈతగాళ్లను రమ్మన్నామని ఆ అధికారి వివరించారు. అయితే, నదిలో పడిపోయిన ట్రాక్టర్‌ను మాత్రం ఇంకా లొకేట్ చేయలేకపోయామని తెలిపారు. అది కనిపిస్తే బయటకు తీయడానికి క్రేన్లు రెడీగా ఉన్నాయని చెప్పారు. బ్రిడ్జీ కింద నది దిగువ వైపు వలలు కట్టామని వివరించారు. 

ఈ ఘటన గురించి తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున స్పాట్‌కు చేరుకున్నారు. పోలీసులతోపాటు రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. కాగా, నది నుంచి ఇంకా బయటకు రాని తమ ఆప్తుల కోసం కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు. వారు ఇక తిరిగి వస్తారో రారో అనే భయంతో విలపిస్తున్నారు. 

తాము స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్‌ను పిలిచామని, వారు ఏ సమయంలోనైనా ఇక్కడకు రావొచ్చని అవినాశ్ కుమార్ వివరించారు.

click me!