మావోయిస్టులకు దెబ్బమీద దెబ్బ.. ఝార్ఖండ్‌ ఎన్కౌంటర్ లో కమాండర్ హతం

Published : May 27, 2025, 10:16 PM IST
Jharkhand Encounter

సారాంశం

మావోయిస్టులకు మరో బిగ్ షాక్ తగిలింది. ఝార్ఖండ్‌లోని పలాములో భద్రతా దళాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో సీనియర్ సీపీఐ (మావోయిస్టు) కమాండర్ హతమయ్యాడు.

మావోయిస్టుల ఏరివేత చేపట్టిన భద్రతా దళాలకు మరో విజయం లభించింది. నిషేధిత సీపీఐ (మావోయిస్టు)కి చెందిన సీనియర్ కమాండర్ ఝార్ఖండ్‌లోని పలాము జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో హతమయ్యాడు. మావోయిస్టుల ఏరివేతకోసం చేపట్టిన ఆపరేషన్ లో భాగంగా ఈ ఎన్కౌంటర్ జరిగింది. 

హుస్సేనాబాద్‌లోని బర్వాహి, నైయా గ్రామాల మధ్య సోమవారం మావోయిస్ట్ నాయకుల కదలికల గురించి పోలీసులకు సమాచారం అందింది. సీఆర్‌పీఎఫ్, ఝార్ఖండ్ జాగ్వార్, స్థానిక పోలీసులతో కూడిన బృందం ఈ సమాచారం ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో మావోయిస్టులు కాల్పులకు దిగారు… దీంతో భద్రతా బలగాలు కూడా ఎదురుకాల్పులకు దిగారు.

మావోయిస్టు కమాండర్ తులసి భుయాన్ ఈ ఎన్‌కౌంటర్‌లో హతమైనట్లు పలాము ఎస్పీ రీష్మా రామేశన్ ధ్రువీకరించారు. రూ.15 లక్షల రివార్డ్ ఉన్న మరో సీనియర్ మావోయిస్టు నితేష్ యాదవ్ గాయపడి తప్పించుకున్నట్లు తెలిపారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో ఒక SLR (సెల్ఫ్-లోడింగ్ రైఫిల్), మ్యాగజైన్, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. 

దాదాపు 12 గంటల పాటు ఎదురుకాల్పులు జరిగాయి.  కనీసం ఆరుగురు మావోయిస్టులు పాల్గొన్న ఈ ఎదురుకాల్పుల్లో దాదాపు 300 రౌండ్లు కాల్పులు జరిగాయని పలాము జోనల్ ఐజీ సునీల్ భాస్కర్ తెలిపారు. 

ఇటీవలి కాలంలో భద్రతా దళాలకు ఇది మూడో గొప్ప విజయం. గత సోమవారం లతెహార్ జిల్లాలో 40 కేసుల్లో వాంటెడ్‌, రూ.5 లక్షల రివార్డ్ కలిగిన మనీష్ యాదవ్ ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. ఇక రూ.10 లక్షల రివార్డ్ ఉన్న జోనల్ కమాండర్ కుందన్ సింగ్ ఖర్వార్‌ను అరెస్ట్ చేసారు… అతడివద్ద రెండు ఆటోమేటిక్ రైఫిల్స్, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. 

మనీష్, కుందన్ ఇద్దరూ ఒక దశాబ్దం పాటు చురుగ్గా ఉన్నారు. 2013లో పదిమంది పోలీసులు మరణించిన ఘటనతో సహా అనేక దాడుల్లో పాల్గొన్నారు.

ఝార్ఖండ్‌లో భద్రతా దళాలు ఆపరేషన్లను ముమ్మరం చేశాయి. అడవుల్లో దాక్కున్న మావోయిస్టు నాయకులను పట్టుకోవడంపై దృష్టి సారించాయి. ఇకముందు మరింత దూకుడుగా ముందుకు వెళతామని భద్రతా బలగాలు ప్రకటించాయి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Nepal Flash Floods: ప్రస్తుతం నేపాల్ పరిస్థితి చూస్తే కన్నీళ్లు ఆగవు | Rescue Operations Continue
Nepal Flash Floods: నేపాల్ వరదల్లో వైరలైన ఇల్లు నిర్మాణ రహస్యం ఇదే | Asianet News Telugu