Today Top Stories: శుభోదయం..ఈ రోజు టాప్ సోర్టీస్ లో నుమాయిష్ ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి, మెట్రో, ఫార్మాసిటీపై రేవంత్ రెడ్డి కీలక ప్రకటన,కస్టమర్లను కర్రలతో కొట్టిన రెస్టారెంట్ సిబ్బంది, మూడు రోజుల్లో రూ. 658 కోట్లు తాగేశారు..భారత్ లో కోవిడ్ కలకలం.. ఒకే రోజు 850 కొత్త కేసులు నమోదు.. ఏడు నెలల్లో ఇదే అత్యధికం.. వైఎస్ షర్మిల ఇంట పెళ్లి భాజాలు, అల్లు అర్జున్‌ని పక్కన పెట్టి వేరే హీరోలను వెతుక్కున్న త్రివిక్రమ్. టెస్టులతో పాటు వన్డేలకు గుడ్ బై.. న్యూఇయర్ వేళ డేవిడ్ వార్నర్ షాకింగ్ డిసీషన్.. న్యూ ఇయర్ రోజు జపాన్ లో భారీ భూకంపం.. సునామీ వచ్చే ఛాన్స్..నోబెల్ శాంతి బహుమతి గ్రహీతకు జైలుశిక్ష వంటి వార్తల సమాహారం.
Today Top Stories: నుమాయిష్ ప్రారంభం..
Numaish: హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో 83వ నుమాయిష్ ను ప్రారంభించారు. ప్రతీ ఏటా నుమాయిష్ ప్రాధాన్యత తగ్గకుండా నిర్వహిస్తున్న సొసైటీని సీఎం అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హైదరాబాద్ కా నిషాన్ 'నుమాయిష్' అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ అంటే చార్మినార్, ట్యాంక్ బండ్ తరువాత గుర్తొచ్చేది నుమాయిష్ అని పేర్కొన్నారు.
సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కమలా నెహ్రూ పాలిటెక్నిక్ కాలేజీని ఇంజనీరింగ్ కాలేజీగా అప్ గ్రేడ్ చేయడానికి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. సామాజిక బాధ్యతతో విద్యా సంస్థలను నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్ సొసైటీకి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. ఎగ్జిబిషన్ సొసైటీ సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని భరోసా ఇచ్చారు. హైదరాబాద్ కు గుర్తింపు తెచ్చేందుకు నుమాయిష్ ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అండగా ఉంటామని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
మెట్రో, ఫార్మాసిటీపై సీఎం కీలక ప్రకటన
మెట్రో, ఫార్మాసిటీని రద్దు చేయడం లేదని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి చెప్పారు.సోమవారంనాడు సచివాలయంలో తెలంగాణ ముఖ్యమంత్రి మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేశారు.ప్రజా ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని స్ట్రీమ్ లైమ్ చేస్తున్నట్టుగా రేవంత్ రెడ్డి వివరించారు. శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే మెట్రో దూరం తగ్గిస్తామన్నారు.బీహెచ్ఈఎల్ నుండి శంషాబాద్ విమానాశ్రయానికి 32 కి.మీ. ఉంటుందన్నారు. ఎంబీబీఎస్ నుండి పాతబస్తీ మీదుగా విమానాశ్రయానికి మెట్రో రైలు మార్గం వెళ్తుందన్నారు. అవసరమైతే మియాపూర్ నుండి రామచంద్రాపురం వరకు మెట్రో రైలును పొడిగిస్తామని సీఎం అనుముల రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు.
బిర్యాని బాగోలేదన్నందుకు.. కస్టమర్లపై హోటల్ సిబ్బంది దాడి...
హైదరాబాద్ లోని అబిడ్స్ గ్రాండ్ హోటల్‌లో కస్టమర్లపై ఆ హోటల్ సిబ్బంది దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. గ్రాండ్ హోటల్‌లో కస్టమర్లపై ఆదివారం రాత్రి దాడికి పాల్పడిన ఆరుగురిని అబిడ్స్ పోలీసులు అరెస్టు చేశారు. దాడికి గురైన కస్టమర్లు దూల్‌పేటకు చెందిన వారిగా గుర్తించారు.దీనిపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హోటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హోటల్ నిర్వాహకులు, వెయిటర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు విచారణలో ఉంది. మరోవైపు హోటల్‌లోని వెయిటర్‌లతో అసభ్యంగా ప్రవర్తించారని, దుర్భాషలాడారని ఆరోపిస్తూ కుటుంబంపై హోటల్ యాజమాన్యం ఫిర్యాదు చేసింది.
తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు
నూతన సంవత్సర వేడుకల వేళ రెండు తెలుగు రాష్ట్రాల్లో మద్యం ఏరులై పారింది. అసలూ తగ్గేదేలే అన్నట్టు ఆదివారం నాడు( డిసెంబర్ 31) రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి. ఏపీ అధికారిక లెక్కల ప్రకారం.. ఆదివారం ఒక్క రోజే రాష్ట్ర వ్యాప్తంగా రూ.147 కోట్ల లిక్కర్ సేల్ జరిగింది. కాగా.. సాధారణ రోజుల్లో రూ.75 కోట్ల లిక్కర్ అమ్మకాలు జరుగుతాయి. అయితే డిసెంబర్ 31 సందర్భంగా లిక్కర్ సేల్ ఓ రేంజ్‌లో పెరిగింది.
తెలంగాణలో కూడా ఇలాంటి పరిస్థితే కనిపించింది. డిసెంబర్ 31వ తేదీ మద్యం అమ్మకాలకు సంబంధించిన లెక్కలు ఇంకా అందుబాటులో రాకపోయినప్పటికీ.. డిసెంబర్ 29, 30, 31 మూడు రోజుల్లో కలిపి మొత్తంగా రూ.658 కోట్ల లిక్కర్ సేల్ అయ్యింది. ఈ మూడు రోజుల్లో 4.76 లక్షల కేసుల మద్యం, 6.31లక్షల కేసుల బీర్లు అమ్ముడు పోయాయి. ఈ మద్యంతో పాటు మటన్, చికెన్, చేపలు అమ్మకాలు కూడా పెరిగాయంట.
వైఎస్ షర్మిల ఇంట్లో పెళ్లి భాజాలు
వైఎస్సార్ టీపీ అధినేత వైఎస్ షర్మిల తెలుగు రాష్ట్రాల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. శుభాకాంక్షలతో పాటు ఓ గుడ్ న్యూస్ కూడా పంచుకున్నారు. ఈ ఫిబ్రవరిలో తన కొడుకు రాజారెడ్డి పెళ్లి చేయబోతున్నట్లు తెలిపారు. జనవరి 18న నిశ్చితార్థం వేడుక ఉంటుందని తెలిపారు. ఈ మేరకు కొడుకు, కాబోయే కోడలు ఫొటోలను షేర్ చేస్తూ ఫిబ్రవరి 17న 2024 వివాహ వేడుక జరగనున్న సంగతి మీతో పంచుకోవడం ఆనందంగా ఉందని ట్వీట్ చేశారు. నేడు కుటుంబ సమేతంగా కాబోయే వధూవరులతో కలిసి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్‌ని సందర్శించనున్నారు.
శిష్యుడు బాటలో గురువు.. టిడిపి ఆరు గ్యారంటీ హామీలు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తన శిష్యుడు రేవంత్ రెడ్డి అనుసరించిన వ్యూహాన్నే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఫాలో అవుతున్నారు. కేసీఆర్ నేతృత్వంలోని బిఆర్ఎస్ ను ఓడించేందుకు ఆరు గ్యారంటీ హామీలు కాంగ్రెస్ కు చాలా ఉపయోగపడ్డాయి. ఇలాగే ఆంధ్ర ప్రదేశ్ లో కూడా వైసిపిని ఓడించి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపేందుకు చంద్రబాబు కూడా ఆరు గ్యారంటీలతో తొలివిడత మేనిఫేస్టో విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు ఆరు గ్యారంటీ హామీలను గుర్తుచేసారు.
అల్లు అర్జున్ కు షాకిచ్చిన త్రివిక్రమ్
అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ టాలీవుడ్‌లో అత్యంత సక్సెస్ ఫుల్ కాంబోగా పేరుతెచ్చుకుంది. ఈ కాంబినేషన్‌లో `జులాయి`, `సన్నాఫ్ సత్యమూర్తి`, `అల వైకుంఠపురములో` చిత్రాలు వచ్చాయి. హ్యాట్రిక్ హిట్ కొట్టారు. ఇప్పుడు మరో సారి ఈ కాంబినేషన్‌లో సినిమా రానుంది. గతంలోనే ఈ ఇద్దరి కాంబోలో సినిమాని ప్రకటించారు. ప్రస్తుతం మహేష్‌బాబు తో `గుంటూరు కారం` చిత్రాన్ని రూపొందిస్తున్న త్రివిక్రమ్.. నెక్ట్స్ బన్నీతోనే సినిమా చేయాల్సి ఉంది. కానీ దాన్ని పక్కన పెట్టారట. అల్లు అర్జున్‌తో చేయాల్సిన సినిమాని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పక్కన పెట్టాడట.
అంతేకాదు వేరే హీరోలను వెతుకుతున్నాడట. విక్టరీ వెంకటేష్, నానిల చుట్టూ తిరుగుతున్నాడట. ఇదే ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతుంది. అయితే త్రివిక్రమ్.. హీరోల చుట్టూ తిరగడం ఏంటనే ఆలోచన వస్తుంది. ఆ వివరాల్లోకి వెళ్లితే.. ప్రస్తుతం బన్నీ.. `పుష్ప2`లో నటిస్తున్నాడు. ఈ సినిమా ఈ ఏడాది ఆగస్ట్ లో విడుదల కానుంది. అంటే మరో ఎనిమిది నెలలు బన్నీ అందుబాటులో లేడు. ఆయన `పుప్ప2`కే పరిమితం అవుతాడు.
రాజమౌళి,మహేష్‌బాబుల సినిమా.. ముహూర్తం అప్పుడే?
రాజమౌళి రూపొందించిన `ఆర్‌ఆర్‌ఆర్` మూవీ విడుదలై దాదాపు రెండేళ్లు కావస్తుంది. కానీ ఆస్కార్ అవార్డు సాధించే వరకు విశ్రమించలేదు జక్కన్న. భారతీయులకు కలగా ఉన్న ఆస్కార్ ని సాధించి పెట్టాడు. ఇప్పుడు ఆయన నెక్ట్స్ సినిమాపై ఫోకస్ పెట్టాడు. సూపర్ స్టార్ మహేష్‌తో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. విజయేంద్రప్రసాద్ టీమ్ దీనిపై వర్క్ చేస్తుంది. ఇదిలా ఉంటే స్క్రిప్ట్ ఫైనల్ కావడానికి ఇంకా ఐదారు నెలలు పడుతుందని అంటున్నారు. కానీ లేటెస్ట్ గా అందుతున్న సమాచారం మేరకు ఈ మూవీ అంతకంటే ముందే ప్రారంభం కానుందట. మార్చిలోనే సినిమాని ప్రారంభించాలనుకుంటున్నారట. పూజా కార్యక్రమాలతో ఓపెనింగ్ చేసి కొంత గ్యాప్‌తో సెట్స్ పైకి వెళ్లాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది.
డేవిడ్ వార్నర్ షాకింగ్ డిసీషన్ ..
న్యూఇయర్ వేళ డేవిడ్ వార్నర్ షాకింగ్ డిసీషన్ తీసుకున్నాడు. టెస్టులతో పాటు వన్డేలకు గుడ్ బై చెప్పాడు. ప్రస్తుతం పాకిస్థాన్ తో జరుగుతున్న టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత టెస్టు ఫార్మట్ నుంచి తప్పుకుంటానని అంతకుముందు డేవిడ్ వార్నర్ పేర్కొన్నాడు. కొత్త సంవత్సరం 2024 వేళ వన్డేలకు కూడా గుడ్ బై చెబుతున్నానని అందరికీ షాకిచ్చాడు. జనవరి 3 నుంచి పాకిస్థాన్‌తో సిడ్నీలో చివరి టెస్టు ఆడనున్న ఆస్ట్రేలియా దిగ్గజ ఓపెనర్ డేవిడ్ వార్నర్ వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
జపాన్ లో భారీ భూకంపం.. సునామీ వచ్చే ఛాన్స్..
ప్రపంచమంతా ఉత్సాహంగా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటున్న సమయంలో జపాన్ భారీ భూకంపంతో ఉలిక్కిపడింది. పశ్చిమ జపాన్ లో సంభవించిన ఈ ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేల్ పై 7.4గా నమోదు అయ్యింది. అయితే ఈ భారీ భూప్రకంపనల వల్ల సునామీ వచ్చే అవకాశం ఉంది. అందుకే ఆ దేశ వాయువ్య తీరానికి అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు.
జపాన్ సముద్ర తీరం వెంబడి నిగటా, టోయామా, యమగాటా, ఫుకుయి, హ్యోగో ప్రిఫెక్చర్లకు కూడా సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. జపాన్ వాతావరణ సంస్థ (జేఎంఏ) ప్రకారం ఇషికావా, పరిసర ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత 7.4గా నమోదైందని పేర్కొంది. సునామీ హెచ్చరికల నేపథ్యంలో 5 మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగిసిపడే అవకాశం ఉంది.
నోబెల్ శాంతి బహుమతి గ్రహీతకు జైలుశిక్ష
కార్మిక చట్టాలను ఉల్లంఘించినందుకు గాను బంగ్లాదేశ్‌కు చెందిన నోబెల్ బహుమతి గ్రహీత ఆర్థికవేత్త డాక్టర్ మహమ్మద్ యూనస్‌కు కోర్టు సోమవారం ఆరు నెలల జైలు శిక్ష విధించింది. జనవరి 7న జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగిన ఈ ఘటన రాజకీయ ప్రేరేపిత ఘటనగా యూనస్ మద్దతుదారులు అభివర్ణించారు.
లేబర్ కోర్టు న్యాయమూర్తి షేక్ మెరీనా సుల్తానా తీర్పును వెలువరిస్తూ, ఆయనపై కార్మిక చట్టాన్ని ఉల్లంఘించినట్లు రుజువైంది. ఒక వ్యాపార సంస్థకు చెందిన మరో ముగ్గురు ఎగ్జిక్యూటివ్‌లతో పాటు గ్రామీణ టెలికాం ఛైర్మన్‌గా చట్టాన్ని ఉల్లంఘించినందుకు యూనస్ ఆరు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని న్యాయమూర్తి తీర్పు చెప్పారు.