రిక్రూట్‌మెంట్ పరీక్షలో చీటింగ్ అడ్డుకోవడానికి సంచలన నిర్ణయం.. ఆ 4 గంటలు ఇంటర్నెట్ బంద్

By Mahesh KFirst Published Aug 21, 2022, 1:42 PM IST
Highlights

ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు నిర్వహించే పరీక్షలో మాల్ ప్రాక్టీస్‌ను అడ్డుకోవడానికి అసోం ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పరీక్ష కేంద్రం పరిసరాల్లో పరీక్ష జరుగుతున్న కాలంలో నాలుగు గంటలపాటు ఇంటర్నెట్ సేవలను రద్దు చేసే నిర్ణయం తీసుకుంది.
 

న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు నిర్వహించే పరీక్షలను ప్రభుత్వాలు ఎంతో పకడ్బందీగా నిర్వహిస్తుంటాయి. అయినా.. తరుచూ అనేక లోపాలు ఆ తర్వాత రోజుల్లో వెలుగుచూస్తుంటాయి. కొశ్చన్ పేపర్ లీక్, మాల్ ప్రాక్టీస్, చీటింగ్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌తో చీటింగ్ వంటి అక్రమాలు ఆ తర్వాత బయటపడుతుంటాయి. వీటిని నివారించడానికి అసోం ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్‌లో చీటింగ్‌ను అడ్డుకోవడానికి ఏకంగా ఇంటర్నెట్ సేవలనే బంద్ చేశారు.

అసోం ప్రభుత్వం 27 వేల ప్రభుత్వ ఉద్యోగాల కోసం రిక్రూట్‌మెంట్ నిర్వహిస్తున్నది. పలు ప్రభుత్వ శాఖల్లోని గ్రేడ్ 3, గ్రేడ్ 4 పోస్టుల ఖాళీలను భర్తీ చేయడానికి రిక్రూట్‌మెంట్ చేపడుతున్నది. ఈ ఉద్యోగాల కోసం 14 లక్షల మంది అభ్యర్థులు హాజరు అవుతున్నారు. రిక్రూట్‌‌మెంట్‌లో భాగంగా ఈ  రోజు తొలి దశ పరీక్ష నిర్వహిస్తున్నది. 

ఈ పరీక్షలో చీటింగ్‌ను అడ్డుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా ఇంటర్నెట్ సేవలనే బంద్ చేసింది. ఎగ్జామ్స్ జరుగుతున్న జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలు అందుబాటులో ఉండబోవని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఎగ్జామ్ సెంటర్ పరిసరాల్లో ఆ పరీక్ష జరుగుతున్న కాలంలో నాలుగు గంటల పాటు ఇంటర్నెట్ సేవలు అందుబాటులో ఉండవు. అలాగే, ప్రతి పరీక్షా కేంద్రంలో గట్టి భద్రతను ఏర్పాటు చేసింది. 144 సెక్షన్ విధించింది.  పరీక్షా కేంద్రాల్లోకి ఇన్విజిలేటర్లు, విద్యార్థులు ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలనూ తీసుకువెళ్లడానికి అనుమతి లేదు. ఎగ్జామినేషన్ సెంటర్‌ను వీడియో తీయాలని ప్రతి ఎగ్జామ్ సెంటర్ ఇంచార్జీకి ఆదేశాలు ఇచ్చింది.

click me!