పశ్చిమ బెంగాల్‌లో బాంబు పేలుడు..టిఎంసి కార్యకర్త మృతి.. ఇద్దరికి తీవ్ర గాయాలు..

By Rajesh KarampooriFirst Published Feb 5, 2023, 7:17 AM IST
Highlights

పశ్చిమ బెంగాల్‌లోని బీర్‌భూమ్ జిల్లా మార్గ్రామ్ గ్రామంలో బాంబు పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక టీఎంసీ కార్యకర్త మృతి చెందగా, ఇద్దరు వ్యక్తులు గాయపడినట్లు సమాచారం. 

పశ్చిమ బెంగాల్‌లోని బీర్భూమ్ జిల్లాలో భారీ బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఓ టిఎంసి కార్యకర్త మరణించగా.. ఇద్దరు కార్యకర్తలు గాయపడ్డారు. ఈ ఘటన శనివారం అర్థరాత్రి 10 గంటల సమయంలో జరిగింది. మరణించిన వ్యక్తి పేరు న్యూటన్ షేక్ గా గుర్తించారు. అతను TMC నాయకుడు లాలూ షేక్ సోదరుడు. ఈ ప్రమాదంలో లాలూ షేక్ కూడా తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. 

స్థానిక సమాచారం ప్రకారం రాత్రి 10 గంటల తర్వాత ఒక్కసారిగా పేలుడు శబ్దం వినిపించింది. ఘటనా స్థలానికి చేరుకున్న జనం ఒక్కసారిగా గందరగోళ వాతావరణం నెలకొంది. ఒకరు మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. బాంబు పేలుడుకు కారణమేమిటనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఈ విషయంలో తదుపరి విచారణ కొనసాగుతోంది. రాజకీయ పగతో తన మామను హత్య చేశారని మృతుడు న్యూటన్ షేక్ మేనల్లుడు ఫిరజుల్ ఇస్లాం ఆరోపిస్తున్నారు. బాంబులు విసిరిన వారు గతంలో బీజేపీలో ఉండి ఇప్పుడు త్రుణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. బాంబు విసిరిన వ్యక్తిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని తెలిపారు.

బాంబు స్వాధీనం

శనివారం నాడు బీర్భూమ్ సమీపంలోని కానింగ్ ప్రాంతంలోని గోలాబరి బజార్‌లో బాంబును స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్‌లో బాంబు పడి ఉండడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి బాంబును స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఘటనా స్థలం నుంచి ఓ పిస్టల్‌, ఆరు గుళికలను కూడా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో చాలా మందిని అరెస్టు చేశారు. వారిని విచారిస్తున్నారు.

గతేడాది టీఎంసీ నాయకుడుపై బాంబుదాడి..

ఏడాది క్రితం 2022 మార్చిలో కూడా టిఎంసి నాయకుడు భాదు షేక్‌ను బాంబు విసిరి హత్య చేశారు. దీనికి సంబంధించిన వీడియో నేటికి నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అందులో కొంతమంది అగంతకులు కారుపై కూర్చున్న బదూ దగ్గరకు వచ్చి బాంబులతో దాడి చేయడం చూడవచ్చు. బదు హత్య తర్వాత.. మార్చి 21న, రాంపూర్‌హాట్‌లోని బగ్తుయ్ గ్రామంలో ఒక గుంపు పెట్రోల్ బాంబులను ఉపయోగించి కొన్ని ఇళ్లను తగులబెట్టారు. ఈ ఘటనలో ఎనిమిది మంది చనిపోయారు. 

click me!