
న్యూఢిల్లీ: దేశంలో వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రధాన రాజకీయ పార్టీలు అన్ని తమ అస్త్రాలను సిద్దం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో.. టైమ్స్ నౌ- ఈటీజీ నిర్వహించిన సర్వే ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి అధికారంలోకి వస్తారని అంచనా వేసింది. ఇంకా ఈ సర్వే ప్రకారం.. రాజస్థాన్ రాష్ట్రంలో కూడా ప్రధాని మోదీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్(ఎన్‌డీఏ) కైవసం చేసుకోనుంది. లోక్‌సభ ఎన్నికల్లో రాజస్థాన్‌లో ఎన్‌డీఏ 19 నుంచి 22 సీట్లను కైవసం చేసుకుంటుందని ఈ సర్వే అంచనా వేసింది.
ప్రతిపక్షాల ఇండియా కూటమి రాజస్తాన్ రాష్ట్రంలో దాదాపు 2 నుండి 9 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది. ఇక, రాజస్థాన్‌లో మొత్తం 25 లోక్‌సభ స్థానాలు ఉన్న సంగతి తెలసిందే. ఇక, 2018లో జరిగిన రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించినప్పటికీ.. 2019 సార్వత్రిక ఎన్నికలలో రాజస్తాన్‌లోని మొత్తం 25 లోక్‌సభ స్థానాలను ఎన్డీయే కైవసం చేసుకోగలిగింది. ఆ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ మొత్తం 24 సీట్లు, రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్ పార్టీ ఒక సీటు గెలుచుకున్నాయి.
ఈ ఏడాది చివరిలో డిసెంబర్‌లో రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి టైమ్స్ నౌ- ఈటీజీ సర్వే అంచనాలే.. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీకి, దాని మిత్రపక్షాలకు అనుకూలంగా ఉంటే.. కాంగ్రెస్ నుంచి బీజేపీ అధికారం చేజిక్కుంచుకోలేదు.
ఇక, టైమ్స్ నౌ- ఈజీటీ రీసెర్చ్ నిర్వహించిన సర్వే.. కేంద్రంలో మోడీ సర్కార్ హ్యాట్రిక్ విజయం నమోదు చేస్తుందని అంచనా వేసింది. ఎన్డీయే కూటమి దాదాపు 296 నుంచి 326 సీట్లు గెలుస్తుందని పేర్కొంది. విపక్షాల ఇండియా కూటమికి 160 నుంచి 190 సీట్లు వస్తాయని సర్వే అంచనా వేసింది. ఎన్డీయేకు సీట్లు తగ్గినప్పటికీ.. బీజేపీ నేతృత్వంలోని కూటమి గెలుస్తుందని అంచనా వేసింది.
పార్టీల వారీగా అంచనాల విషయానికి వస్తే.. భారతీయ జనతా పార్టీ దాదాపు 288 నుండి 314 సీట్లు గెలుస్తుందని, కాంగ్రెస్ దాదాపు 62 నుండి 80 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని అంచనా వేసింది.