
Orange Alert issued in six north eastern states: అసోంలో బుధవారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతో రెండు వేర్వేరు చోట్ల పిడుగుపాటుకు గురై ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈశాన్య భారత రాష్ట్రాల్లో ఈ వారంలో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ.. భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
వివరాల్లోళ్తే.. అసోంలో పిడుగుపాటుకు గురై ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దర్రాంగ్ జిల్లాలో ఒకరు, కామరూప్ (మెట్రో)లో మరొకరు మరణించినట్లు అసోం రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (ఏఎస్డీఎంఏ) నివేదిక తెలిపింది. కాగా, ప్రస్తుత వాతావరణ పరిస్థితుల మధ్య ఐఎండీ ఆరు ఈశాన్య భారత రాష్ట్రాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అసోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర రాష్ట్రాల్లో బుధవారం నుంచి మార్చి 17 వరకు వర్షాలు కురుస్తాయని తెలిపింది. పలు చోట్ల ఉరుములు-మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
దర్రాంగ్ జిల్లాలో ఒకరు, కామరూప్ (మెట్రో)లో మరొకరు మరణించారు. దర్రాంగ్ లోని ఖర్పోరి గ్రామంలో పిడుగుపాటుకు మజురుద్దీన్ (60) అనే వ్యక్తి మృతి చెందాడు. గౌహతిలోని సత్గావ్ ప్రాంతంలో మమత బేగం (13) అనే మైనర్ బాలిక పిడుగుపాటుకు మృతి చెందినట్లు ఏఎస్డీఎంఏ తెలిపింది. గౌహతిలో రానున్న రెండు రోజుల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని గౌహతిలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఉష్ణోగ్రతల్లో మార్పులు..
ప్రాంతీయ వాతావరణ కేంద్రం రిపోర్టుల ప్రకారం.. అసోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లోని ఇతర ప్రాంతాలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మార్చి 15-17 తేదీల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ ఈశాన్య రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. మార్చి 16 నుంచి పలు ఈశాన్య రాష్ట్రాల్లో కొత్త క్రియాశీల పశ్చిమ ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది.
బంగాళాఖాతం నుంచి తూర్పు మధ్య, తూర్పు, ఈశాన్య భారతంలోకి అల్పపీడన ద్రోణి ప్రవేశించడం, మధ్య ట్రోపోస్ఫెరిక్ పశ్చిమ ద్రోణితో సంకర్షణ చెందడం వల్ల అసోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇదే సమయంలో ఉష్ణోగ్రతలు తగ్గుతాయని పేర్కొంది. మార్చి 16 నుంచి ఉప హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కింలో భారీ వర్షాలు, ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఉష్ణోగ్రతల్లో మార్పులు ఉంటాయని తెలిపింది. గౌహతి-దిస్పూర్ లో గరిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్, కనిష్ఠ ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యే అవకాశం ఉంది.