
3 Trucks Collide On Madhya Pradesh Highway: మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన తర్వాత వాహనాల్లో ఉన్న సరుకులు, పార్శిళ్లు, కొన్ని కార్లు దగ్ధం కావడంతో ఆ ప్రాంతంలో భారీగా నల్లగి పొగ మేఘాలు ఏర్పడ్డాయి.
వివరాల్లోకెళ్తే.. మధ్యప్రదేశ్ లోని ధార్ జిల్లాలో శనివారం మూడు ట్రాలర్ ట్రక్కులు ఢీకొనడంతో ఇద్దరు డ్రైవర్లు మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారు. కొండ ప్రాంతమైన ముంబయి-ఆగ్రా నాలుగు లైన్ల హైవే రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. బ్రేక్ ఫెయిల్ కావడంతో ముంబయి-ఆగ్రా జాతీయ రహదారిలోని గణేష్ ఘాట్, ధార్ వద్ద ముంబయి వైపు వెళ్తున్న ట్రక్కు ఎదురుగా వస్తున్న మరో రెండు ట్రక్కులను ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన తర్వాత సరుకులు, పార్శిళ్లు, కొన్ని కార్లు దగ్ధం కావడంతో పెద్ద ఎత్తున మటలు, ఆ తర్వాత నల్లటి పొగ మేఘాలు ఏర్పడ్డాయి. ఒక ట్రక్కు హైవేపై బోల్తా పడటంతో ఆ మార్గంలోకి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. కంటైనర్లలో మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బందిని పంపించారు. మంటల్లో కాలిన గాయాలతో ఇద్దరు మృతి చెందగా, ముగ్గరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రాణాలతో బయటపడిన వారు ధన్మోడ్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతులిద్దరి మృతదేహాలకు ధన్మోద్ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించనున్నట్టు స్థానిక పోలీసులు తెలిపారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతున్నదని పేర్కొన్నారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు విజయవంతంగా మంటలను అదుపులోకి తీసుకురావడంతో గణేష్ ఘాట్ వద్ద హైవే ట్రాఫిక్ మళ్లీ సాఫీగా సాగుతోంది. ప్రస్తుతం రూట్లను బ్లాక్ చేయలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, శిథిలాల రోడ్డు పక్కగానే ఉండటంతో నెమ్మదిగా వెళ్లండి అని ఆ ప్రాంతంలో సైన్ బోర్డులు ఏర్పాటు చేశారు.