
జమ్ముకాశ్మీర్‌లోని సాంబా, రాంబన్, రాజౌరి జిల్లాల్లో బుధవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు ఆర్మీ సైనికులు చనిపోయారు. మరో ఇద్దరు గాయాలపాలయ్యారని అధికారులు చెప్పారు. ఈ ఘటనలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
కతువా ప్రాంతానికి చెందిన మన్‌ప్రీత్ సింగ్ (25) అనే ఆర్మీ జవాన్ సాంబా జిల్లాలోని వీర్ భూమి పార్క్ సమీపంలోని వంతెనపై నుండి పడి మృతి చెందాడు. ఆ సమయంలో తన ప్రైవేట్ వాహనం నడుపుతూ రోడ్డుపై నుంచి జారి కింద పడి చనిపోయినట్టు అధికారులు పేర్కొన్నారు. ఆ సైనికుడికి శ్రీనగర్‌లో పోస్టింగ్ ఉందని చెప్పారు. అయితే మార్చి 26 నుంచి సెలవుల్లో ఉన్నారని తెలిపారు. కాగా ఆయన తన కథువా నివాసం నుంచి జమ్మూకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు వివరించారు.
రాంబన్ జిల్లా ఖూని నల్లా సమీపంలోని జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారికి అనుకోని ఉన్న లోతైన లోయలో పడి మరో సైనికుడు చనిపోయారు. ఆయన ప్రయాణిస్తున్న వాహనం లోయలో బోల్తా పడటంతో ప్రమాదం జరిగి సైనికుడు మృతి చెందాడు. ఆయన మృతదేహాన్ని పోలీసులు, పౌర వాలంటీర్లు స్వాధీనం చేసుకున్నారని అధికారులు తెలిపారు.
రాజౌరి జిల్లాలోని రాజౌరి-కోట్రంకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరో సైనికుడు మృతి చెందారు. ట్రల్లా రెహాన్ రహదారి వద్ద వారి ప్రైవేట్ కారు లోయలో పడటంతో బుధాల్‌కు చెందిన షాజియా అక్తర్ (27) అనే సైనికుడు చనిపోయారు. ఆయన భార్య నజియా కౌసర్, బంధువు మహ్మద్ ఇఖ్లాక్ లకు గాయాలు అయ్యాయని అధికారులు చెప్పారు. క్షతగాత్రులనందరినీ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే వారి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా.. మంగళవారం కశ్మీర్‌లోని హైదర్‌బోరా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ సీఆర్ పీఎఫ్ జవాన్ ఎంఎస్ మణి చనిపోయారు. ఆయన స్వస్థలం తిరువళ్లూరు జిల్లా పళ్ళిపట్టు సమీపంలోని అత్తిమాంజేరి. మణి జమ్మూ కాశ్మీర్ లో విధులు నిర్వహిస్తున్నారు. మంగళవారం నాడు మణితో పాటు 12 మంది సీఆర్ పీఎఫ్ జవాన్లు శ్రీనగర్ నుంచి బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. అయితే హైదర్‌బోరా వద్దకు వీరు ప్రయాణిస్తున్న బస్సు చేరుకోగానే ఓ లారీని ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో మణి తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆయనను వెంటే హాస్పిట్ లకు తీసుకెళ్లారు. అయితే చికిత్స పొందుతున్న సమయంలోనే ఆయన పరిస్థితి విషమించి చనిపోయారు. ఆ బస్సుల్లో ప్రయాణిస్తున్న జవాన్లకు స్వల్ప గాయాలు కావడంతో వారంతా సురక్షితంగా ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో మణి చనిపోయారనే విషయం తెలియడంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మణి మృతి చెందడంపై పీఎంకే యువజన విభాగం అధ్యక్షుడు అన్బుమణి రాందాస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశానికి సేవలు అందిస్తున్న జవాను రోడ్డు ప్రమాదంలో చనిపోవడం మనసును కలిచివేస్తోందని చెప్పారు.