
Karnataka: ఆటపాటలతో ఉత్సాహంగా గడిపిన స్నేహితులకు ఆ విహారయాత్ర విషాదాన్ని మిగిల్చింది. సముద్ర తీరంలో స్నేహితులంతా కలిసి సరదాగా.. ఆడిపాడారు. కానీ వారి సంతోషం ఎంతో సేపు ఉండలేదు. సెల్ఫీలు తీసుకుంటూ ప్రమాదవశాత్తు ముగ్గురు విద్యార్థులు సముద్రంలో గల్లంతయ్యారు. ఈ హృదయవిదారక ఘటన కర్ణాటకలోని ఉడిపిలోని మాల్పే సముద్ర తీరం సమీపంలోని సెయింట్ మేరీస్ ఐలాండ్ జరిగింది. ఇద్దరు విద్యార్థుల మృతదేహాలు లభ్యం కాగా, మరొకరి కోసం గాలిస్తున్నారు.
పోలీసుల కథనం ప్రకారం.. కేరళ కొట్టాయంలోని సమీపంలోని ఎట్టుమనూర్‌లోని మంగళం కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌కు చెందిన 42 మంది విద్యార్థులు, ఇద్దరు ప్రొఫెసర్స్‌తో కలిసి బుధవారం సాయంత్రం సెయింట్ మేరీస్ ద్వీపానికి విహారయాత్రకు వచ్చారు. గురువారం ఉదయం అందులో కొందరు విద్యార్థులు సముద్ర తీరంలోని నిషేధిత ప్రాంతంలో ఆడుతూ.. సరదగా.. సెల్ఫీలు దిగారు. ఈ క్రమంలో ఓ విద్యార్థి తీరంలోకి వెళ్లి సెల్ఫీ దిగడానికి ప్రయత్నించాడు. కానీ అలల తీవ్రత ఎక్కువగా ఉండటంతో సముద్రంలోని కొట్టుకవెళ్లాడు. దీనిని గమనించిన అతని స్నేహితులు రక్షించడానికి సముద్రంలోకి వెళ్లి గల్లంతయ్యారు.
గల్లంతైన ముగ్గురు విద్యార్థులను అలెన్ రెజీ (22), అమల్ సి అనిల్ (22), ఆంటోని (21)గా గుర్తించారు. వీరిలో అమల్ అనిల్, అలెన్ రెజీ మృతదేహాలు లభ్యంకాగా.. ఆంటోని షేనోయ్ కోసం గాలిస్తున్నారు. మృతదేహాలను ఉడిపి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరణించిన విద్యార్థుల తల్లిదండ్రులకు విషాదం గురించి సమాచారం అందించామని, వారు ఉడిపికి వెళ్తున్నారని మంగళం కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ వర్గాలు తెలిపాయి.
నిషేధిత ప్రాంతంలోకి వెళ్లి.. అజాగ్రత్తగా సెల్ఫీ దిగినట్టు మాల్పే బీచ్ లీజు హోల్డర్ సుదేష్ శెట్టి తెలిపారు. సెయింట్ మేరీస్ ద్వీపంలో ఐదుగురు లైఫ్‌గార్డులను నియమించినట్లు శెట్టి తెలిపారు. అయితే సెల్ఫీ దిగాలని ఓ విద్యార్థి డేంజర్ జోన్ ను దాటేశాడు. నిషేధిత జోన్‌లోకి వెళ్లవద్దని లైఫ్‌గార్డ్ ఆదేశించిన లోనికి వెళ్లినట్టు ఆరోపించారు. అతడిని రక్షించేందుకు వెళ్లిన ఇద్దరు కూడా నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారనీ, ద్వీపం యొక్క తూర్పు వైపున గుర్తించబడిన సురక్షితమైన స్విమ్మింగ్ జోన్ ఉందని, అయితే వారు ద్వీపం యొక్క పశ్చిమ వైపున ఉన్న నిషేధిత ప్రాంతంలోకి ప్రవేశించినప్పుడు ఈ విషాదం సంభవించిందని శెట్టి తెలిపారు. ఈ రకమైన విషాదాన్ని నివారించడానికి ఏకైక మార్గం ద్వీపం యొక్క పశ్చిమ భాగంలోకి ప్రవేశించడాన్ని పూర్తిగా నిషేధించడమేనని తెలిపారు.