
ముంబయి: శివసేన రెబల్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి మహారాష్ట్ర సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే శివసేన క్యాడర్‌ను తీసుకెళ్లండని ఏక్‌నాథ్ షిండే, బీజేపీకి ఆయన సవాల్ విసిరారు. అంతేకాదు, శివసేన ఓటర్లనూ తీసుకెళ్లే సాహసం ఉన్నదా? అంటూ ప్రశ్నించారు. శివసేనను పూర్తిగా నాశనం చేయాలని బీజేపీ ప్రయత్నిస్తున్నదని అన్నారు.
శివసేన కార్పొరేటర్లను ఉద్దేశించి ఆయన వర్చువల్‌గా మాట్లాడారు. సాధారణ శివసేన కార్యకర్తలే తన ఆస్తులని సీఎం, శివసేన పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. శివసేన పార్టీని నమ్మినవారే మోసం చేశారని ఆరోపించారు. మెజార్టీ శివసేన ఎమ్మెల్యేలు గుజరాత్‌లో క్యాంప్ వేసిన ఏక్‌నాథ్ షిండేతో వెళ్లారు. దీంతో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం చిక్కుల్లో పడింది.
మీలాంటి వారు ఎందరో అభ్యర్థులు ఉన్నా.. మేం ఇలాంటి తిరుగుబాటుదారులకు టికెట్లు ఇచ్చామని అన్నారు. మీ కష్టంతోనే వీరు గెలిచి తర్వాత అసంతృప్తులుగా తయారయ్యారని పేర్కొన్నారు. కానీ, మీరు మాత్రం ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో పార్టీ వెంట నిలిచారని తెలిపారు. అలాంటి మీకు ధన్యవాదాలు చెప్పడం చాలా చిన్నదని వివరించారు. కూటమి సభ్యులతో ఉన్న ఆరోపణలపై పరిశీలించడానికి ఏక్‌నాథ్ షిండేను రమ్మన్నానని తెలిపారు. కానీ, చట్టసభ్యులు బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని తనను ఒత్తిడి చేస్తున్నట్టు ఆయన చెబుతున్నారు. అలాగైతే.. ఆ ఎమ్మెల్యేలను వెంటబెట్టుకుని తిరిగి రావాల్సిందిగా చెప్పానని, ఈ అంశంపై చర్చిద్దాం అని సూచించానని పేర్కొన్నారు. శివసేనతో బీజేపీ అభ్యంతరకరంగా వ్యవహరించిందని, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని ఆరోపించారు.
కానీ, చాలా మంది రెబల్ ఎమ్మెల్యేలపై కేసులు నమోదై ఉన్నాయని, వారు బీజేపీతో వెళితే అవి క్లోజ్ అవుతాయని, తమతో ఉంటే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని భావిస్తున్నారని ఉద్ధవ్ తెలిపారు. కానీ, ఇది ఫ్రెండ్షిప్‌కు సంకేతమా? అని వివరించారు.
శివసేన వర్కర్ సీఎం అవుతాడంటే.. బీజేపీతో మీరు వెళ్లండి.. కానీ, మీరు డిప్యూటీ సీఎం కోసమే వెళ్లుతున్నావంటే.. తనతో ముందు చెప్పి ఉండాల్సిందని పరోక్షంగా ఏక్‌నాథ్ షిండేకు చురకలు అంటించారు. తనతో చెప్పితే ఆయనను డిప్యూటీ సీఎంను చేసి ఉండేవాడినని తెలిపారు.
తనకు సీఎం కుర్చీపై మోహం లేదని, తాను పార్టీని నడపలేనని కార్యకర్తలు భావించినా
అధ్యక్షుడిగా రాజీనామా చేస్తానని అన్నారు. శివసేన ఒక ఐడియాలజీ అని, హిందూ ఓటు బ్యాంకును కూడగట్టుకోవడానికి శివసేనను బీజేపీ నాశనం చేయాలని భావిస్తున్నదని తెలిపారు. ఒక వేళ రెబల్ ఎమ్మెల్యే లు బీజేపీ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా ఆ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలబోదని స్పష్టం చేశారు. తర్వాతి ఎన్నికల్లో రెబల్స్ గెలిచేంత సీన్ లేదని తేల్చేశారు. ఏక్‌నాథ్ షిండే కు సవాల్ చేస్తూ.. దమ్ముంటే శివసేన ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేయండి అని, అది సాధ్యం కాదని తెలిపారు. ఎన్నికైన ప్రతినిధులను నీవు పట్టుకెళ్లగలిగావని, కానీ, వారిని గెలిపించిన ఓటర్లనే తమతో వెంట తీసుకునిపోగలరా? అంటూ అడిగారు. అంతే కాదు, పార్టీని వీడాలనుకున్నవారు వెళ్లొచ్చని, తాను శివసేనను మళ్లీ నిర్మిస్తానని పేర్కొన్నారు.