
వేసవి ఆరంభంలోనే ఎండలు దంచికొడుతున్నాయి. గత కొద్ది రోజులుగా భానుడు నిప్పులుకురిపిస్తున్నారు. ఎండ తీవ్రతకు మధ్యాహ్నం పూట బయటకు రావడానికి భయపడుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే.. ఏప్రిల్, మేలో పరిస్థితి ఏంటని జనం భయపడుతున్నారు. అయితే ఈ క్రమంలోనే భారత వాతావరణ శాఖ వెల్లడించిన వివరాలు మరింత ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయి. గత 122 ఏళ్లలో ఈ మార్చి నెలలో అత్యంత వేడి వాతావరణం నెలకొందని భారత వాతావరణ శాఖ విశ్లేషణ ఆధారంగా పేర్కొంది. మార్చి నెలలో అత్యంత వెచ్చని రోజులు నమోదయ్యాయని తెలిపింది.
యువ్య భారతదేశంలో సుదీర్ఘ పొడి వాతావరణం తీవ్రమైన వేడి వాతావరణానికి దారితీసిందని IMD అధికారులు తెలిపారు. ఈ ఏడాది మార్చి నెల.. 1901 నుంచి documented historyని పరిశీలిస్తే అత్యంత వెచ్చని మార్చిగా నిలిచిందన్నారు. ఇక, మార్చి 2022లో భారతదేశంలో సగటు పగటి ఉష్ణోగ్రత 33.1 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. 2010 మార్చిలో భారతదేశ సగటు నెలవారీ ఉష్ణోగ్రత 33.09 డిగ్రీల సెల్సియస్‌గా ఉంది. ఈ ఏడాది మార్చిలో సగటు పగటి ఉష్ణోగ్రత గత రికార్డులన్నింటినీ అధిగమించింది.
ఇక, గురువారం (మార్చి 31) మూడు చోట్ల గరిష్ట ఉష్ణోగ్రత 41 డిగ్రీల మార్కును దాటడంతో ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలు తీవ్రమైన వేడిగాలులతో అల్లాడిపోయాయి. శుక్రవారం ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 36.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.. ఇది సాధారణం కంటే మూడు డిగ్రీలు ఎక్కువగా ఉందని ఐఎండీ తెలిపింది. కనిష్ట ఉష్ణోగ్రత 21.4 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉన్నట్టుగా తెలిపింది.
ఈ ఏడాది మార్చిలో రెండు హీట్‌వేవ్‌లు వచ్చాయి.. మొదటిది మార్చి 11 నుంచి మార్చి 21 మధ్య.. రెండోది మార్చి 26న ప్రారంభమై ఇప్పటికీ కొనసాగుతోంది. పుణెలోని IMD క్లైమేట్ మానిటరింగ్ అండ్ ప్రిడిక్షన్ గ్రూప్ హెడ్ OP Sreejith హిందూస్థాన్ టైమ్స్‌తో మాట్లాడుతూ.. ఈ తీవ్రమైన వేడికి వర్షపాతం లేకపోవడం ఒక కారణమని చెప్పారు. ‘‘మార్చి నెలలో రెండు హీట్ వేవ్ సంఘటనలు జరిగాయి. యాంటీ-సైక్లోనిక్ సర్క్యులేషన్ ఉందని.. అది పశ్చిమం వైపు నుంచి ఉత్తర, మధ్య భారతదేశానికి వేడి చేరడానికి కారణమైంది. ఎండ తీవ్రత పెరగడానికి గ్లోబల్ వార్మింగ్ కూడా ప్రధాన కారణాలలో ఒకటి’ అని చెప్పారు.
ది టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం.. వాతావరణ మార్పు భారతదేశంలో తీవ్రమైన వాతావరణం పరిస్థితులకు కారణమవుతుందని IMDలోని National Weather Forecasting Centre శాస్త్రవేత్త రాజేంద్ర జెనామణి చెప్పారు. ఇది వేడి తరంగాలు, తుఫానులు, భారీ వర్షపాతం రూపంలో ఉండవచ్చని పేర్కొన్నారు. ఇక, మార్చి 30న జెనమణి ఏఎన్‌ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. ఏప్రిల్ 1 నుంచి ఉష్ణోగ్రతల్లో కొంచెం తగ్గుదల ఉంటుందని చెప్పారు. తర్వాత మళ్లీ అంతటా అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని చెప్పారు.
ఎండ తీవ్రత నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. నీటి శాతం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలాను తీసుకోవాలని చెప్పారు. పండ్ల రసాలు, శీతల పానీయాలు తీసుకోవాలని తెలిపారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచిస్తున్నారు.