
Arvind Kejriwal On BBC IT Survey: మీడియా ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమనీ, దాని స్వేచ్ఛపై దాడి చేయడం ప్రజల గొంతు నొక్కడమేనని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. పన్ను ఎగవేత ఆరోపణలపై దర్యాప్తులో భాగంగా ఆదాయపు పన్ను శాఖ మంగళవారం దేశ రాజధాని ఢిల్లీ, అలాగే, ఆర్థిక రాజధాని ముంబయిలోని బీబీసీ కార్యాలయాలతో పాటు మరో రెండు ప్రాంతాల్లో 'సర్వే ఆపరేషన్' (ఐటీ రైడ్స్) ప్రారంభించిన ఒక రోజు తర్వాత కేజ్రీవాల్ స్పందిస్తూ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. బీబీసీ కార్యాలయాల్లో ఐటీ రైడులను ప్రస్తావిస్తూ.. బీజేపీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వారిపైకి ఐటీ, సీబీఐ, ఈడీలను వదిలేస్తున్నారని ఆరోపించారు. దీనిని ప్రజల గొంతును నొక్కడంతో సమానంగా ఆయన అభివర్ణించారు.
"ప్రజాస్వామ్యంలో మీడియా నాలుగో స్తంభం. మీడియా స్వేచ్ఛపై దాడి చేయడం ప్రజల గొంతు నొక్కడమే అవుతుంది. బీజేపీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ఐటీ (ఆదాయపన్ను శాఖ), సీబీఐ (సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్), ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్)లను వదిలేస్తారు’’ అని ఆయన ఆరోపించారు. అలాగే, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) దేశ ప్రజాస్వామ్య నాయకునిగా చేయాలనుకుంటున్నారా? వ్యవస్థ-సంస్థలతో పాటు అది మొత్తం దేశాన్ని బానిసలుగా చేయాలనుకుంటున్నారా? అని ప్రశ్నించారు.
మీడియా ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం, మీడియా స్వేచ్ఛపై దాడి ప్రజల గొంతు నొక్కడంతో సమానం. బీజేపీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ఐటీ, సీబీఐ, ఈడీలను వెనకే వదిలేస్తున్నారు : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్
దేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థ, ఇతర వ్యవస్థలను అణచివేస్తూ దేశం మొత్తాన్ని బానిసలుగా మార్చాలని బీజేపీ భావిస్తోందా? : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్
ప్రతిపక్షాలు బీబీసీపై సోదాలను ఖండించగా, బీబీసీ భారత్ కు వ్యతిరేకంగా విషపూరిత రిపోర్టింగ్ చేస్తోందని బీజేపీ ఆరోపించింది. ఈ వాగ్వాదం మధ్య బీబీసీ అనుబంధ సంస్థల అంతర్జాతీయ పన్నులు, బదిలీ ధరలకు సంబంధించిన అంశాలను పరిశీలించేందుకు ఈ సర్వే నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. బీబీసీకి నోటీసులు ఇచ్చినా పట్టించుకోలేదని ఆరోపించారు. తన లాభాల్లో గణనీయమైన భాగాన్ని మళ్లించిన ఆరోపణల గురించి ఓ అధికారి ప్రస్తావించినట్టు మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి.
బీబీసీ ఆఫీసుల్లో సోదాలు..
బీబీసీ ఇండియా కార్యాలయాల్లో మంగళవారం ఉదయం 11 గంటలకు ఐటీ అధికారుల సోదాలు ప్రారంభమయ్యాయి. ప్రాంగణంలోని అన్ని ఎలక్ట్రానిక్ పరికరాలను తమ ఆధీనంలోకి తీసుకున్న ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఉద్యోగుల మొబైల్ ఫోన్లను తనిఖీ చేశారు. ఢిల్లీ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగుల మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని వారిని ఇళ్లకు వెళ్లాలని ఆదేశించారు. మధ్యాహ్నం షిఫ్టులో పనిచేసే వారిని ఇంటి నుంచే పనిచేయాలని కోరారు.