Third wave: అక్టోబర్‌లో పీక్.. రోజుకు ఆరు లక్షల కరోనా కేసులు: ప్రభుత్వ ప్యానెల్

By telugu teamFirst Published Aug 23, 2021, 3:07 PM IST
Highlights

కరోనా వైరస్ థర్డ్ వేవ్ త్వరలోనే భారత్‌లో రావొచ్చని, అక్టోబర్‌లో పరాకాష్టకు చేరుకోవచ్చని ప్రభుత్వ ప్యానెల్ పేర్కొంది. పిల్లల కోసం దేశవ్యాప్తంగా ఆరోగ్య సదుపాయాలను మెరుగుపరుచుకోవాలని సూచించింది. టీకా పంపిణీ వేగాన్నీ పెంచాలని తెలిపింది. లేదంటే రోజుకు ఆరు లక్షల కరోనా కేసులు నమోదయ్యే ముప్పు ఉందని హెచ్చరించింది.

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ విలయం మరువక ముందే మూడో వేవ్ ప్రళయం సృష్టించనున్నట్టు ప్రభుత్వ ప్యానెల్ హెచ్చరించింది. అక్టోబర్ నెలలో థర్డ్ వేవ్ పీక్ స్టేజీకి చేరే ముప్పు ఉందని అంచనా వేసింది. అంతేకాదు, థర్డ్ వేవ్ కాలంలో గరిష్టంగా ఒక  రోజులో ఆరు లక్షల కరోనా కేసులు రిపోర్ట్ అయ్యే బీభత్స పరిస్థితులు ఉండవచ్చని తెలిపింది. థర్డ్ వేవ్‌లో పెద్దలకు సరిసమానంగా పిల్లలకూ మహమ్మారి ముప్పు ఉంటుందని వివరించింది. కాబట్టి, చిన్నారుల కోసం ఆరోగ్య సదుపాయాలు మెరుగుపరుచుకోవాలని  సూచించింది. కేంద్ర హోం శాఖ పరిధిలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కింద ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ తాజాగా ఓ రిపోర్టు వెల్లడించింది. ఈ నివేదిక థర్డ్ వేవ్‌పై పలుహెచ్చరికలతోపాటు సూచనలూ చేసింది.

థర్డ్ వేవ్‌తో పిల్లలకే ఎక్కువ ముప్పు ఉంటుందని తొలుత నిపుణులు అభిప్రాయపడ్డారు. అనంతరం అందుకు విరుద్ధ వాదన కూడా ప్రచారంలోకి వచ్చింది. తొలి రెండు వేవ్‌లలో పెద్దలకంటే పిల్లలకు కరోనా ముప్పు కొద్ది పాళ్లలో తక్కువగానే ఉన్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కానీ, ఇదే ధోరణి ఇకపై సాగదని చాలా మంది నిపుణులు అంటున్నారు. థర్డ్ వేవ్‌లో పెద్దలకు ఉన్నట్టే అదే స్థాయిలో పిల్లలకూ కరోనా మహమ్మారి ముప్పు ఉంటుందని చెబుతున్నారు. తాజాగా, నిపుణుల కమిటీ కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. కానీ, దేశంలో పెద్దలకు ఉన్నట్టు చిన్నపిల్లలకు సరిపడా ఆరోగ్య వసతులు లేవని తెలిపింది. అందుకే, చిన్నపిల్లల చికిత్స కోసం వైద్యులు, ఇతర సిబ్బంది, వెంటిలేటర్లు, అంబులెన్స్‌లు, ఇతర పరికరాలను సమకూర్చుకోవాలని సూచించింది.

థర్డ్ వేవ్‌లో ప్రత్యేకంగా చిన్నపిల్లలకే ముప్పు ఉంటుందని చెప్పలేమని నివేదిక తెలిపింది. మనదేశంలో కరోనా టీకా ఇంకా చిన్నపిల్లలకు అందడం లేదు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ చిన్నపిల్లలకు జాగ్రత్తలు అవసరమని పేర్కొంది. చిన్న పిల్లలకు ఇంకా టీకా అందించడం లేదనందున వారి సంరక్షణపై జాగ్రత్తలు తీసుకోవాలని వివరించింది. థర్డ్ వేవ్ ముప్పు ముంగిట్లో ఉన్నందున చిన్న పిల్లలకు టీకా అందించే ప్రయత్నాలను ముమ్మరం చేయాలని సూచించింది. ముఖ్యంగా చిన్నారులు, వారిలోనూ ఇతర దీర్ఘకాల వ్యాధుల బారినపడ్డవారికి టీకా అందించడం ప్రథమ కర్తవ్యంగా పెట్టుకోవాలంది.

వ్యాక్సినేషన్ రేటు ఇలాగే కొనసాగితే మూడ్ ముప్పులో భారీ కేసులు ఖాయమని నివేదిక తెలిపింది. పండిత్ దీన్‌దయాల్ ఎనర్జీ యూనివర్సిటీ, నిర్మ యూనివర్సిటీలు సంయుక్తంగా చేసిన అధ్యయనంలో భారత టీకా పంపిణీ రేటు 3.2 శాతంగా ఉన్నట్టు తేలిందని వివరించింది. ఒకవేళ టీకా పంపిణీ రేటు పెరగకుండా థర్డ్ వేవ్‌లో గరిష్టంగా రోజుకు ఆరు లక్షల కేసులు నమోదయ్యే అవకాశముందని తెలిపింది. టీకా పంపిణీ రేటును మరో ఐదు రెట్లు పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదించిందని గుర్తుచేసింది. ఒకవేళ ఇదే ప్రతిపాదనను నిజం చేస్తే భారత్ కేవలం 25శాతం కేసులనే చూడొచ్చని పేర్కొంది. అంటే సెకండ్ వేవ్‌లో నమోదైన స్థాయిలోనే కేసులు రావొచ్చని అంచనా వేసింది. అందుకే థర్డ్ వేవ్‌ను నివారించడంలో టీకా పంపిణీది కీలక పాత్ర అని పేర్కొంది. అలాగే, థర్డ్ వేవ్‌కు డెల్టా ప్లస్ వేరియంట్ ప్రధాన కారణంగా ఉంటుందా? అనే సంశయంపైనా సమాధానమిచ్చింది. ఇప్పటి వరకు థర్డ్ వేవ్‌కు డెల్టా ప్లస్ వేరియంట్ కారణమని చెప్పడానికి ఆధారాల్లేవని, కానీ, ఈ వేరియంట్‌ ఆందోళనకారకమేనని వివరించింది.

click me!