బ్యాంకు లాకర్ ముందు దొంగల పూజలు.. రూ. 34 లక్షల చోరీ.. ‘నేను డేంజర్.. నా వెంట పడొద్దు’.. పోలీసులకు వార్నింగ్

By Mahesh KFirst Published May 20, 2022, 4:35 PM IST
Highlights

కేరళలో కొందరు దొంగలు బ్యాంకును దోచుకున్నారు. 30 లక్షల విలువైన బంగారాన్ని, రూ. 4 లక్షల విలువైన నగదును దొంగిలించారు. అయితే, చోరీకి ముందు వారు బ్యాంకు లాకర్ ముందు పూజలు చేశారు. దేవుడి ఫొటో పెట్టి పూజలు చేసినట్టు తెలుస్తున్నది. అంతేకాదు. తన వెంట పడొద్దని, తాను చాలా డేంజర్ అని బెదిరిస్తూ పోలీసులకు ఆ దొంగలు ఓ నోట్ పెట్టి ఉడాయించారు.
 

తిరువనంతపురం: ఏదైనా శుభ కార్యం ప్రారంభించేటప్పుడు, వ్యాపారాలు, భూమి కొనుగోలు, ఇంటి నిర్మాణం వంటి కార్యక్రమాలు చేసేటప్పుడు పూజలు చేయడం సర్వసాధారణం. కానీ, దొంగతనం చేయడానికి పూజలు, క్రతవులు చేయడాన్ని ఎవరూ ఎక్కడా చూసి ఉండరు. కేరళలో బ్యాంకు దోచుకున్న కొందరు దొంగలు మాత్రం ఈ వ్యవహారాన్ని దొంగతనానికి కూడా ఆపాదించారు. ఔను.. వారు బ్యాంకు దొంగతనానికి వెళ్లి.. బ్యాంకు లాకర్ ముందు పూజలు చేశారు. అనంతరం, లాకర్ నుంచి 30 లక్షల విలువైన బంగారం, రూ. 4 లక్షల విలువైన నగదును చోరీ చేశారు.

పతానపురంలోని జనతా జంక్షన్ వద్ద గల ప్రైవేటు ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్ పతానపురం బ్యాంకర్స్‌లో దొంగలు పడ్డారు. ఈ విషయాన్ని ఓనర్ రామచంద్రన్ నాయర్ తొలిసారి గుర్తు పట్టారు. సోమవారం ఉదయం 9 గంటలకు ఆయన బ్యాంకుకు వెళ్లడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. రెండు లాకర్‌లో పెట్టి ఉంచిన బంగారం, నగదను దోచుకున్నారని, మొత్తం రూ. 34 లక్షలను చోరీ చేశారని వివరించారు.

పోలీసులు స్పాట్‌కు వచ్చారు. వారు వచ్చే సరికి బ్యాంకు లాకర్ ముందు ఆధ్యాత్మిక పూజలు కొన్ని కనిపించాయి. అక్కడ ఒక దేవుడి ఫొటో ఉన్నది. ఒక బల్లెం, ఒక నిమ్మకాయ, తమలపాకు ఉన్నాయి. అంతేకాదు, వాటన్నింటితో పోలీసులకు ఒక నోట్ కూడా కనిపించింది. అందులో ఇలా రాసి ఉంది. ‘నేను డేంజరస్ మనిషిని. నా వెంట పడొద్దు’ అని పోలీసులను ఉద్దేశించి ఉన్నది. ఆ గది చుట్టూ మనిషి వెంట్రుకలు జల్లి ఉన్నాయి. పోలీసు కుక్కను తప్పుదారి పట్టించడానికి ఈ పని చేసి ఉండొచ్చని భావిస్తున్నారు.

ఈ బ్యాంకు మూడు అంతస్తుల భవనంలో ఉన్నది. ఫస్ట్ ఫ్లోర్‌లో బ్యాంకు ఉన్నది. దొంగలు బహుశా రూఫ్ ద్వారా లోపలికి వచ్చి ఉంటారని అనుమానిస్తున్నారు. ఫస్ట్ ఫ్లోర్ వరకు దిగి.. బ్యాంకుకు వేసి ఉన్న ఐరన్ గ్రిల్స్‌ను, డోర్‌ను కట్టర్‌ సహాయంతో తొలగించి ఉంటారని అనుమానిస్తున్నారు.

click me!