
ముంబయి: మామిడి పళ్ల (Mangoes) సీజన్ (Season) మరో రెండు నెలల్లో ప్రారంభం కానుంది. ఇప్పుడిప్పుడే మామిడి పళ్లు అందుబాటులోకి వస్తున్నాయి. పళ్ల వ్యాపారులు ఈ పండ్ల రాజాను అమ్మడానికి సర్వం సిద్ధం చేస్తున్నారు. వారూ సిద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే సీజన్‌లో తొలి మామిడి పళ్లు పూణె మార్కెట్ (Market) కు వచ్చాయి. అక్కడ సీజన్‌లో తొలి లాట్ మామిడి పళ్లు వచ్చినప్పుడు వాటికి వేలం (Auction) వేసి విక్రయదారులు కొనుగోలు చేస్తుంటారు. ఈ బిడ్‌లో పలికిన ధరలు.. ఆ ఏడాది మామిడి పళ్ల సీజన్‌ను అంచనా వేయడానికి ఉపకరిస్తుందని వ్యాపారులు చెబుతున్నారు. ఈ వేలంలో ఒక్క క్రేట్ ధర రూ. 31 వేలు పలికి రికార్డు సృష్టించింది. 50 ఏళ్లలో ఇంత ధర ఎప్పుడూ పలుకలేదు. దీంతో ఈ ఏడాది మామిడి పళ్ల సీజన్ తమకు సిరులు కురిపిస్తాయని వ్యాపారులు భావిస్తున్నారు.
మహారాష్ట్ర పూణెలోని అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ కమిటీ (ఏపీఎంసీ) యార్డ్‌కు ఈ ఏడాది సీజన్‌లో తొలి లాట్ మామిడి పళ్లు వచ్చాయి. వాటికి వేలం వేయగా.. ఒక వ్యాపారి క్రేట్ మామిడి పళ్లకు రూ. 31వేలు పెట్టడానికి సిద్ధం అయ్యాడు. ఈ సీజన్‌లో ఇవే తొలి మామిడి పళ్లు అని వేలం గెలుచుకున్న వ్యాపారి అన్నారు. తొలి మామిడి పళ్లు మార్కెట్ మండీకి వచ్చినప్పుడు ఇలా వేయడం ఆనవాయితీ అని, వ్యాపారులు సీజన్‌లో తొలి మామిడి పళ్లను చేజిక్కించుకోవడానికి పోటీ పడుతారని తెలిపారు. ఈ తొలి మామిడి పళ్లు వ్యాపారులకు ఎంతో ఊరట ఇస్తాయని, హోల్ సేల్ మార్కెట్‌లో వారికి విలువ పెంచుతాయని పేర్కొన్నారు.
ఈ వేలానికి సంబంధించి యూట్యూబ్‌లో ఓ వీడియో పోస్టు చేశారు. అందులో మామిడి పళ్ల క్రేట్‌ను అలంకరించి ఉన్నట్టు కనిపించింది. అక్కడి వారు కొందరు ఆ క్రేట్‌కు దండాలు పెడుతుండటం గమనార్హం. ఈ తొలి మామిడి పళ్ల వేలం ధరలే ఆ ఏడాది సీజన్‌లో ఉండే డిమాండ్‌ను అంచనా వేయడానికి ఉపకరిస్తాయని వారు చెప్పారు. మరో రెండు నెల్లలో మామిడి పళ్ల సీజన్ అధికారికంగా ప్రారంభం కానుంది. పూణె వ్యవసాయ మార్కెట్‌లో నిర్వహించిన ఈ వేలం రూ. 5 వేలతో ప్రారంభం అయింది.
కాగా, ఈ సీజన్‌లో అమెరికాకు మన మామిడి పండ్లను ఎగుమతి చేసేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఇటీవల ఇరు దేశాల మధ్య జరిగిన ట్రేడ్ ఒప్పందాల్లో భాగంగా భారత్ లో పండిన మామిడి పండ్లపై విధించిన నిషేధాన్ని అమెరికా ఎత్తివేసింది. దీంతో భారత్ లో పండే మామిడి, దానిమ్మ పండ్లను అమెరికాకు ఎగుమతి చేసేందుకు మార్గం సుగమం అయింది. ఈ సీజన్ లో పండే మామిడి పండ్ల ఎగుమతికి సంబంధించి ఇరు దేశాల మధ్య జరిగిన ట్రేడ్ ఒప్పందాలపై రెండు దేశాలు సంతకాలు చేశాయి. ఈ క్రమంలోనే మామిడి పండ్ల దిగుమతికి యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ (యుఎస్‌డీఎ) ఒకే చెప్పింది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా అంతర్జాతీయ ప్రయాణాలపై విధించిన పరిమితుల కారణంగా రేడియేషన్ సదుపాయాన్ని తనిఖీ చేయడానికి USDA ఇన్‌స్పెక్టర్‌లు భారతదేశాన్ని సందర్శించలేకపోయినందున భారతీయ మామిడి పండ్ల దిగుమతిపై 2020 నుంచి పరిమితులు విధించింది అమెరికా.