
న్యూఢిల్లీ: స్విస్ బ్యాంకుల్లో భారతీయులు ఎంత జమ చేసుకున్నామని కచ్చితంగా తెలిపే అధికారిక అంచనాలేమీ లేవని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తెలిపారు. ఎంపీ అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఆమె ఈ మేరకు లోక్‌సభకు రాతపూర్వక సమాధానం ఇచ్చారు. స్విస్ బ్యాంకుల్లో భారతీయులు, భారత కంపెనీల డిపాజిట్లపై కేంద్ర ప్రభుత్వానికి ప్రశ్నలు వేశారు. ఈ ప్రశ్నలకు సమాధానంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ స్పందించారు.
భారత పౌరులు, భారత కంపెనీలు స్విస్ బ్యాంకుల్లో ఎంత మొత్తం డిపాజిట్లు చేశారని కచ్చితంగా తెలిపే అధికారిక అంచనాలు ఏమీ లేవని వివరించారు. అయితే, ఇటీవలి కాలంలో కొన్ని మీడియా రిపోర్టులు వచ్చాయని తెలిపారు. ఈ రిపోర్టుల ప్రకారం స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డబ్బు 2020తో పోల్చితే 2021లో పెరిగాయని తెలుస్తున్నట్టు వివరించారు.
అయితే, భారతీయులు స్విట్జర్లాండ్‌లో దాచి పెట్టుకున్న బ్లాక్ మనీని.. ఈ డిపాజిట్లు వెల్లడించలేవనీ ఆ మీడియా రిపోర్టులు పేర్కొనడం గమనార్హం. అలాగే, స్విస్ నేషనల్ బ్యాంక్ (ఎన్ఎన్‌బీ) వార్షిక బ్యాంకింగ్ స్టాటిస్టిక్స్‌ను స్విట్జర్లాండ్‌లో భారతీయుల డిపాజిట్ల కోసం విశ్లేషణలు చేయవద్దనీ ఎన్ఎన్‌బీ అధికారులు తెలిపినట్టు కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ వివరించారు.