
ఆ అమ్మాయి ఓ అబ్బాయిని ప్రేమించింది. అయితే ఆ అబ్బాయిది తన కులం కాదు. తన మతం కాదు. అయినప్పటికీ అతనితో కలిసి జీవించాలని అనుకుంది. కానీ దీనికి ఆ అమ్మాయి తల్లి ఒప్పుకోలేదు. ప్రేమ వ్యవహారాన్ని మానుకోవాలని సూచించింది. తల్లి మాటలను కూతురు పట్టించుకోలేదు. వేరే మతం అబ్యాయిని ప్రేమిస్తూ తన పరువు తీస్తోందని భావించిన తల్లి.. కూతురును చంపేయాలని అనుకుంది. దీనికి తన ప్రియుడి సాయం తీసుకుంది. దీని కోసం ప్లాన్ రెడీ చేసి అనుకున్నట్టుగానే కూతురును చంపేసింది. అయితే ఈ హత్యను కూతురు ప్రేమించిన వ్యక్తిపైకి తోసేయాలని కుట్ర పన్నినా.. అది విఫలం అయ్యింది.
జహీరాబాద్ (zaheerabad) లో మూడు రోజుల క్రితం సంచలనం సృష్టించిన మైనర్ బాలిక హత్య కేసును పోలీసులు చేధించారు. డీఎస్పీ శంకర్ రాజు (dsp shankar raju), సీఐ రాజశేఖర్ (ci rajashekar) తెలిపిన వివరాల ప్రకారం.. హుగ్గేలి మండలానికి చెందిన బుజ్జమ్మ (bujjamma)కూతురు (16) అదే గ్రామానికి చెందిన ఫకీర్ అప్సర్ ను ప్రేమించింది. అయితే ఈ విషయం తల్లికి నచ్చలేదు. వేరే కులం, వేరే మతం వ్యక్తిని ప్రేమించకూడదని చెప్పింది. తల్లి మాటలను కూతురు పట్టించుకోలేదు. కూతురు తీరులో మార్పు రాకపోవడంతో తల్లి కసాయిగా ఆలోచించింది. కూతురు కంటే పరువే ముఖ్యమని భావించింది. కూతురును చంపేయాలని నిర్ణయించుకుంది. దీని కోసం తన ప్రియుడు నర్సింహులు (narsimhulu) సాయం కోరింది.
మైనర్ ను చంపేందుకు ఇద్దరూ పది రోజుల కిందటే ప్రణాళిక రచించి ఉంచారు. ఆదివారం రాత్రి చంపేయాలని భావించారు. ఇద్దరూ కలిసి మద్యం తాగారు. పథకం ప్రకారం కూతురు దగ్గరికి వెళ్లి.. అఫ్సర్ మామిడి తోటలో ఉన్నాడని, అక్కడికి వెళ్లి సమస్యను తేల్చుకుందామని చెప్పి తోటకు తీసుకెళ్లింది. అంతకు ముందే నర్సింహులు అక్కడికి చేరుకొని ఉన్నాడు. ఆ యువకుడితో ప్రేమ వ్యవహారం మానుకోవాలని బలవంతం చేశారు. అది కుదరదని, తాను అతడినే పెళ్లి చేసుకుంటానని కూతురు చెప్పింది. దీంతో తల్లి కూతురు కాళ్లపై కూర్చొని కదలకుండా చేసింది. నర్సింహులు చున్నీతో బాలిక గొంతును చుట్టేసి ఊపిరాకుండా చేశాడు. దీంతో ఆమె మృతి చెందింది.
ఈ నేరాన్ని కూతురు ప్రేమించిన యువకుడికి తోసేయాలని భావించారు. అందులో భాగంగానే ఇంటికి వెళ్లింది. తన కూతురు చెప్పకుండా ఎక్కడికో వెళ్లిపోయిందని చుట్టు పక్కల వారికి చెప్పింది. ఆమె కోసం వెతుకున్నట్టుగా కంగారు పడుతూ వారిని నమ్మించేందుకు ప్రయత్నించింది. ఉదయం సమయంలో ఘటన స్థలానికి వెళ్లి తీవ్రంగా రోధించింది. దీంతో అందరూ అఫ్సర్ నేరానికి పాల్పడి ఉంటారని అనుకున్నారు. అతడిని అదుపులోకి తీసుకొని విచారించిన పోలీసులు నేరం అతడు చేయలేదని నిర్ధారించుకున్నారు. టెక్నాలజీ ఉపయోగించి ఆ సమయంలో అక్కడున్న సిగ్నల్స్, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకొని నర్సింహులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు విచారణ చేపట్టడంతో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో నర్సింహులు ను ఏ1గా, తల్లిని ఏ2గా గుర్తించి కేసు నమోదు చేశారు.