దేశంలో మ‌త ఉద్రిక్త‌త‌లు కొత్తేమీ కాదు.. అవి 7వ శ‌తాబ్దం నుంచే ఉన్నాయి - క‌ర్ణాట‌క బీజేపీ నేత సీటీ ర‌వి

Published : May 05, 2022, 10:40 AM IST
దేశంలో మ‌త ఉద్రిక్త‌త‌లు కొత్తేమీ కాదు.. అవి 7వ శ‌తాబ్దం నుంచే ఉన్నాయి - క‌ర్ణాట‌క బీజేపీ నేత సీటీ ర‌వి

సారాంశం

దేశం ఇప్పుడే కొత్తగా మత విద్వేశాలను చూడటం లేదని కర్ణాటక బీజేపీ నేత సీటీ రవి అన్నారు. 7వ శతాబ్దం నుంచే భారతదేశంపై దాడి మొదలైందని చెప్పారు. కొన్ని మతాలకు సహనం లేదని అన్నారు. 

భార‌తదేశంలో మ‌త ఉద్రిక్త‌ల‌కు కొత్తేమీ కాదని, అవి 7వ శ‌తాబ్దం నుంచే ఉన్నాయ‌ని క‌ర్ణాట‌క కు చెందిన బీజేపీ నేత సీటీ ర‌వి అన్నారు. కొన్ని మతాలకు సహనం లేదని తెలిపారు. దేశంలో కొన్ని అసహన విశ్వాసాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. గోవా పర్యటనలో రాష్ట్ర బీజేపీ అగ్రనేతలు, శాసనసభ్యులతో సమావేశాల సంద‌ర్భంగా ఆయ‌న ఈ ప్రకటన చేశారు. ఆ రాష్ట్రంలో త్వ‌ర‌లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నిక‌ల‌కు ఆయ‌న పార్టీ త‌ర‌ఫున ఇంచార్జ్ గా ఉన్నారు.

‘‘ మత ఉద్రిక్తత కొత్తదేమీ కాదు. ఇలా జరగడం ఇదే మొదటిసారా ? ఇది 7 వ శతాబ్దంలో భారతదేశంపై మొదటి దాడి నుండి ప్రారంభమైంది, నేటి నుండి కాదు ’’ అని ఆయ‌న అన్నారు. ‘‘ కొంతమంది మత ఉద్రిక్తతలను సృష్టించడానికి ప్రయత్నిస్తారు. కొన్ని అసహన విశ్వాసాలు ఉన్నాయి. వీరికి సహనం లేదు. వారు ఇలానే చేస్తారు.’’  అని వ్యాఖ్యానించారు. 

కర్ణాటకతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో లౌడ్ స్పీకర్లు, హిజాబ్ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. దేశవ్యాప్తంగా గత నెల రోజుల్లో అనేక మత హింసా ఘటనలు చోటు చేసుకున్నాయి. రామనవమి, హనుమాన్ జయంతి సందర్భంగా మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, ఢిల్లీలో హింస చెలరేగింది. ప‌లు చోట్ల అల్ల‌ర్లు జ‌రిగాయి. 

సిటీ ర‌వి కర్ణాటకలోని చిక్ మగళూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయ‌న బీజేపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా కూడా వ్య‌వహ‌రిస్తున్నారు. బీజేపీ ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవ‌ల ఆయ‌న కర్ణాటకలో హలాల్ మాంసాన్ని నిషేధించాలని, విద్యాసంస్థల్లో యూనిఫాం డ్రెస్ కోడ్ ను నిషేధించాలని బహిరంగంగానే కోరారు. హిజాబ్ వివాదంపై కోర్టు తీర్పినిచ్చిన త‌రువాత కూడా ఆయ‌న వ్యాఖ్య‌లు చేశారు. 

తరగతి గదుల్లో హిజాబ్ ను నిషేదిస్తూ క‌ర్ణాట‌క హైకోర్టు తీర్పునిచ్చిన తరువాత ముస్లిం సంఘాలు బంద్ కు పిలుపునిచ్చాయి. దీంతో సీటీ ర‌వి స్పందించారు. ప్రజలు జిన్నా మనస్తత్వాన్ని విడనాడాల్సిన అవసరం ఉందని రవి అన్నారు. ‘‘ జిన్నా మనస్తత్వం నుంచి బయటకు వచ్చి, భారతీయతను పెంపొందించండి. జిన్నా ఎజెండా ఇప్పుడు పని చేయదు’’ అని ఆయన అన్నారు. బీజేపీ ఏ వర్గానికి లేదా మతానికి వ్యతిరేకం కాదని అన్నారు. కానీ చీలికను సృష్టించడం ద్వారా సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి మతాన్ని ఉపయోగించేది కాంగ్రెస్ అని రవి పదేపదే చెప్పారు. కాగా ఇటీవలి కాలంలో హిజాబ్ నిషేధం, హలాల్ మాంసం నిషేధం, విద్యా సంస్థల్లో యూనిఫామ్ సివిల్ కోడ్, లౌడ్ స్పీకర్ వివాదం వంటి అంశాలపై కర్ణాటక మతపరమైన ఉద్రిక్తతలతో సతమతమవుతోంది.

PREV
click me!

Recommended Stories

భార‌త్‌లో ల‌క్ష‌ల కోట్ల పెట్టుబడులు పెడుతోన్న అమెజాన్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌.. భ‌విష్య‌త్తులో ఏం జ‌ర‌గ‌నుందంటే?
Viral News : ఇక జియో ఎయిర్ లైన్స్.. వన్ ఇయర్ ఫ్రీ..?