ఎలాంటి కామెంట్స్ అయిన సంస్కారవంతంగా ఉండాలి.. తమిళనాడు పరిణామాలపై తెలంగాణ గవర్నర్ తమిళిసై..

By Sumanth KanukulaFirst Published Jan 14, 2023, 2:11 PM IST
Highlights

తమిళనాడులో అధికార ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే), గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి మధ్య నెలకొన్న పోరుపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. తమిళనాడులో రాజకీయంగా సంచలన వాతావరణం నెలకొందని అన్నారు. 

తమిళనాడులో అధికార ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే), గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి మధ్య నెలకొన్న పోరుపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. తమిళనాడులో రాజకీయంగా సంచలన వాతావరణం నెలకొందని అన్నారు. డీఎంకే నేత శివాజీ కృష్ణమూర్తి చేసిన వివాదాస్పద వ్యాఖ్యపై తమిళిసై సౌందరరాజన్ స్పందిస్తూ.. భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ రాజకీయ పార్టీలు, గవర్నర్‌ల మధ్య వ్యాఖ్యలు సంస్కారవంతంగా ఉండాలని పేర్కొన్నారు. ‘‘కొందరు ఉన్నతాధికారుల గురించి నీచమైన పదజాలంతో వ్యాఖ్యానిస్తున్నారు. మనమందరం సంస్కారవంతులుగా.. అందరం స్నేహపూర్వకంగా మెలగాలి. భిన్నాభిప్రాయాలు ఉన్నా, స్నేహపూర్వకంగా తెలియజేయవచ్చు’’ అని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. 

‘‘తమిళనాడు రాజకీయంగా సంచలన వాతావరణం నెలకొని ఉంది. అయితే నా అభ్యర్థన ఏమిటంటే.. భిన్నాభిప్రాయాలు ఉన్నా.. బహిరంగ ప్రదేశాల్లో చాలా సంస్కారవంతంగా ఉండాలి. సైద్ధాంతిక విబేధాలతో రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు చేసే ఎలాంటి వ్యాఖ్యలు అయినా చాలా సంస్కారవంతంగా ఉండాలని నేను అభ్యర్థిస్తున్నాను’’అని తమిళై అన్నారు. తమిళం చాలా సంస్కారవంతమైన భాష అని.. ఎలాంటి అసభ్యకరమైన భాషను ప్రోత్సహించవద్దని రాజకీయ పార్టీలను, నాయకులను కోరారు.

జనవరి 9న తమిళనాడు అసెంబ్లీలో గవర్నర్ ఎన్ రవి ప్రసంగించారు. తన ప్రసంగంలో ప్రభుత్వం రూపొందించిన ముసాయిదాలోని కొన్ని భాగాలను రవి దాటవేశారు. కొన్ని చోట్ల గవర్నర్ ఆర్ఎన్ రవి ప్రభుత్వం అందజేసిన ప్రసంగం కాకుండా సొంతంగా మాట్లాడారని డీఎంకే సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే సీఎం స్టాలిన్.. అసెంబ్లీలో సాంప్రదాయంగా గవర్నర్ చేసే ప్రసంగంలో రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రసంగాన్ని మాత్రమే ఆన్ రికార్డులో ఉంచాలని, గవర్నర్ చేర్చిన వ్యాఖ్యలను తొలగించాలని స్పీకర్‌ను కోరారు. ఈ మేరకు సీఎం స్టాలిన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టినప్పుడు గవర్నర్ రవి అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. 

శాసనసభలో రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి వ్యవహరించిన తీరుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు డీఎంకే ఫిర్యాదు చేసింది. ఢిల్లీలో రాష్ట్రపతిని కలిసిన డీఎంకే ప్రతినిధి బృందం.. పలు విషయాలపై సీఎం స్టాలిన్ రాసిన లేఖను సీల్డ్ కవర్‌లో అందజేశారు. 

ఇదిలా ఉంటే.. అసెంబ్లీ నుంచి గవర్నర్ ఆర్‌ఎన్ రవి వాకౌట్ చేసిన తర్వాత ఆయనకు వ్యతిరేకంగా తమిళనాడులో పెద్ద ఎత్తున పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. పశ్చిమ చెన్నైలోని వల్లువర్ కొట్టం, అన్నాసాలై ప్రాంతాల్లో ‘‘#GetoutRavi’’ అని ఉన్న పోస్టర్లు కనిపించాయి. గవర్నర్‌కు, సర్కార్‌కు మధ్య వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. గత కొన్ని రోజులుగా ట్విట్టర్‌లో ‘‘#గెటౌట్ రవి’’ టాప్ ట్రెండ్‌గా మారింది.
 

click me!