తెరుచుకోనున్న తూత్తుకుడి స్టెరిలైట్ ప్లాంట్.. తమిళనాడు ప్రభుత్వం కీలకనిర్ణయం..

By AN TeluguFirst Published Apr 26, 2021, 5:01 PM IST
Highlights

ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తూత్తుకుడి లో వేదాంత కు చెందిన స్టెరిలైట్ ప్లాంట్ ను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది. 

ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తూత్తుకుడి లో వేదాంత కు చెందిన స్టెరిలైట్ ప్లాంట్ ను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది. 

ఈ ప్లాంటును కాలుష్యం వెదజల్లుతోందన్న కారణంతో 2018లో మూసివేసిన విషయం తెలిసిందే. ఆక్సిజన్ ఉత్పత్తి కోసం మాత్రమే స్టెరిలైట్ ప్లాంట్ ను తెరవాలని నిర్ణయించారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఓ ప్రత్యేక కమిటీ దీని పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టనుంది. ఈ రోజు జరిగిన అఖిలపక్ష సమావేశం అనంతరం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

ప్లాంట్ లో ఆక్సిజన్ ఉత్పత్తి మాత్రమే జరగాలని... ఇతర కార్యకలాపాలేవీ ప్రారంభించొద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత సమస్యపై శుక్రవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ప్లాంట్ ను తెరవడంలో ఉన్న ఇబ్బందేంటని తమిళనాడు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

ప్రజలు ఆక్సిజన్ కొరతతో చనిపోతున్న తరుణంలో ప్లాంట్ ను ప్రభుత్వం చేతిలోకి తీసుకుని ప్రాణ వాయువును ఉత్పత్తి చేయవచ్చు కదా అని నిలదీసింది. అంతకు ముందు తాము ఆక్సీజన్ ఉత్పత్తి చేసి కోవిడ్ రోగులకు ఉచితంగా అందిస్తామని వేదాంత ముందుకు వచ్చింది. కావాలంటే రాష్ట్ర ప్రభుత్వమే తమ ప్లాంట్ ద్వారా ఆక్సిజన్ ఉత్పత్తి చేసుకోవచ్చని సూచించింది.

ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పరిణామాల అనంతరం తాజాగా ప్లాంట్ ను ప్రారంభించాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించడం గమనార్హం.
 

click me!