తమిళ హీరో విజయ్ ను రాజకీయాల్లోకి తేవాలని ప్రశాంత్ కిశోర్ ప్రయత్నాలు సాగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కమల్ హాసన్ తో విభేదాల నేపథ్యంలో ప్రశాంత్ కిశోర్ విజయ్ ను రంగంలోకి దించాలని చూస్తున్నట్లు చెబుతున్నారు.
చెన్నై: మక్కళ్ నీది మయ్యం చీఫ్, సినీ నటుడు కమల్ హాసన్ తో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కు విభేదాలు పొడసూపినట్లు తెలుస్తోంది. పార్టీ విధానాల విషయంలో ఇరువురికి మధ్య తేడాలు వచ్చినట్లు చెబుతున్నారు. తమిళనాడులో ప్రశాంత్ కిశోర్ మక్కళ్ నీది మయ్యం కోసం పనిచేస్తున్నారు. ఈ స్థితిలో ప్రశాంత్ కిశోర్ హీరో విజయ్ ను రాజకీయ తెర మీదికి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
పార్టీ విధానాల విషయంలో కమల్ హాసన్ ప్రశాంత్ కిశోర్ తో తీవ్రంగా విభేదిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కమల్ హాసన్ తో ప్రశాంత్ కిశోర్ తెగదెంపులు చేసుకునే అవకాశం ఉందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా త్వరలో పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆయన కూడా ప్రశాంత్ కిశోర్ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. రజినీకాంత్, ప్రశాంత్ కిశోర్ మధ్య ఇటీవల ముంబైలో చర్చలు జరిగినట్లు కూడా చెబుతున్నారు.
undefined
తాజా పరిణామాల నేపథ్యంలో హీరో విజయ్ ను రాజకీయాల్లోకి లాగేందుకు ప్రశాంత్ కిశోర్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తమిళనాడులో రాజకీయ పరిస్థితులను అంచనా వేయడానికి పీకే టీమ్ సమగ్ర సర్వే నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ సర్వేలో విజయ్ పేరు కూడా చేర్చినట్లు తెలుస్తోంది. విజయ్ కు 28 శాతం మంది ప్రజల మద్దతు ఉన్నట్లు ఆ సర్వేలో తేలినట్లు చెబుతున్నారు.
దాంతో రాజకీయాల్లోకి వస్తే గెలిపించే బాధ్యతను తాము తీసుకుంటామని ప్రశాంత్ కిశోర్ విజయ్ తో చెప్పినట్లు తెలుస్తోంది. తమిళనాడులో అధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి అవసరమైన వ్యూహరచనను తాము ఏడాది పాటు చేస్తామని కూడా విజయ్ తో చెప్పినట్లు తెలుస్తోంది.
తమిళ ప్రజలు విజయ్ కు అనుకూలంగా ఉన్నారని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైఎస్ జగన్ ను అధికారంలోకి తెచ్చినట్లు తమిళనాడులో అధికారంలోకి తెస్తామని ఆయన విజయ్ కు వివరించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, విజయ్ మాత్రం అంతా విన్నారని, తన నిర్ణయాన్ని మాత్రం వెల్లడించలేదని అంటున్నారు. మరో ఐదేళ్ల పాటు రాజకీయాల వైపు చూడకూడదని విజయ్ భావిస్తున్నట్లుగా కూడా చెబుతున్నారు.