
మహారాష్ట్ర రాజకీయాలను శాసించిన ఎప్సీపీలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆ పార్టీలోని కీలక నేత అజిత్ పవార్ తిరుగుబాటు చేయడంతో పార్టీలో చీలిక ఏర్పడింది. తాజాగా ఎన్సీపీ నేత శరద్ పవార్ పై అజిత్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. వయసు మీద పడ్డ పవార్ స్వచ్చంధంగా తప్పుకుని.. కొత్త వారికి దారినివ్వాలని అన్నారు. అజిత్ పవార్ మాట్లాడుతూ.." ఇతర పార్టీల్లో నేతలు వయసు దాటిన తర్వాత రిటైర్ అవుతారు.. బీజేపీలో నేతలు 75 ఏళ్లకే రిటైర్ అవుతారు.. మీరు కూడా కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వండి.. మేం తప్పులు చేస్తే చెప్పండి. మీ వయసు 83 కదా. మీరు మమ్ముల్నీ ఆశీర్వదించండి" అని అజిత్ పవార్ అన్నారు.
అజిత్ పవార్ వ్యాఖ్యలను శరద్ పవార్ కుమార్తె అయిన ఎంపి సుప్రియా సూలే తిప్పికొట్టారు. ఆమె మాట్లాడుతూ.. "ఇప్పుడు సీనియర్‌గా ఉన్నవారు మాకు ఆశీస్సులు ఇవ్వాలని కొందరు అంటున్నారు. వారు పనిచేయడం మానేశారా? యాక్టివ్ గా లేదా? రతన్ టాటాకు 86 ఏళ్లు. సీరమ్ ఇనిస్టిట్యూట్‌కి చెందిన సైరస్ పూనావాలా వయస్సు 84. అమితాబ్ బచ్చన్ వయస్సు 82.." అని సుప్రియా సూలే అన్నారు. వారెన్ బఫెట్ , ఫరూక్ అబ్దుల్లా పేర్లు కూడా ఆమె ప్రస్తావించారు. వారు( శరద్ పవార్) వయస్సు మీద పడిన యాక్టివ్ గా పనిచేస్తున్నారు. మీ కోపం నాపైనే కదా.. కాబట్టి మమ్మల్ని తిట్టినా సహిస్తాం. కానీ మా నాన్నను కాదు అగౌరవపరిస్తే.. మాత్రం సహించబోం" అని ఆమె అన్నారు.
అదే సమయంలో, శరద్ పవార్ నివాసం వెలుపల కూడా అలాంటి పోస్టర్లు ఏర్పాటు చేయబడ్డాయి. ‘83 ఏళ్ల యోధుడు ఒంటరి పోరాటం’ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. శరద్ పవార్ నివాసం వెలుపల ఈ నినాదంతో కూడిన పోస్టర్లు అంటించారు.