
ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ తనను అరెస్ట్ చేయడాన్ని సవాలు చేస్తూ మనీష్ సిసోడియా అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. సిసోడియా తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు విన్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్.. నేరుగా సుప్రీం కోర్టుకు వచ్చే ముందు హైకోర్టుకు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. దీనిపై అభిషేక్ సింఘ్వి స్పందిస్తూ.. జర్నలిస్ట్ వినోద్ దువా కేసులో సుప్రీంకోర్టు తీర్పును సింఘ్వీ ఉదహరించారు. అదే మనీష్ సిసోడియా నేరుగా సుప్రీం కోర్టును ఆశ్రయించడానికి కారణమని చెప్పారు.
ఈ క్రమంలోనే సీబీఐ అరెస్ట్‌ను సవాలు చేస్తూ సిసోడియా దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారణకు అనుమతించింది. ఇందుకు సంబంధించి ఈరోజు మధ్యాహ్నం 3:50 గంటలకు విచారణ జరుపుతామని ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ చంద్రచూడ్ తెలిపారు. ఇదిలా ఉంటే.. కోవిడ్-19 మహమ్మారిపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై చేసిన విమర్శలపై జర్నలిస్టు వినోద్ దువాపై దేశద్రోహం కేసు నమోదు అయింది. దీనిపై వినోద్ దువా నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే వినోద్ దువాపై నమోదైన దేశద్రోహం కేసును 2021 జూన్‌లో సుప్రీంకోర్టు రద్దు చేసింది.
ఇక, ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మనీష్ సిసోడియాది కీలక పాత్ర అని కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నయి. ఈ క్రమంలోనే సిసోడియాను ఫిబ్రవరి 26వ తేదీన మరోసారి విచారించిన సీబీఐ అధికారులు.. ఆయనను అరెస్ట్ చేశారు. ఆయనను సోమవారం సీబీఐ అధికారులు.. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఆయనను ఐదు రోజుల పాటు రిమాండ్‌కు ఇవ్వాలని కోరారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ చాలా ప్రణాళిక బద్దంగా, రహస్యంగా కుట్ర పొందాని సీబీఐ కోర్టులో వాదనలు వినిపిచింది. ఇందులో మనీష్ సిసోడియాది కీలక పాత్ర అని కూడా తెలిపింది. ఈ కేసులో సమర్థవంతమైన విచారణ కోసం మనీష్ సిసోడియా కస్టడీ అవసరమని వాదించింది. ఈ కేసులో తన పాత్ర ఏమీ లేదని సిసోడియా పేర్కొన్నప్పటికీ.. ఆయన వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకున్నారని విచారణలో తేలిందని సీబీఐ కోర్టుకు తెలియజేసింది.
మరోవైపు మనీష్ సిసోడియాకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని ఆయన తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. మనీష్ సిసోడియా సెల్‌ఫోన్‌లు మార్చారని సీబీఐ చెబుతుందని.. అయితే అది నేరం కాదని అన్నారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నుంచి కూడా సలహాలు తీసుకున్న తర్వాతే ఈ విధానాన్ని అమలు చేశామని.. దీనికి సంప్రదింపులు అవసరం కాబట్టి కుట్ర జరిగే అవకాశం లేదని న్యాయవాది చెప్పారు.
అయితే ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం సిసోడియాను ఐదు రోజుల పాటు సీబీఐ కస్టడీకి అనుమతించింది. ఈ క్రమంలోనే నేటి నుంచి ఐదు రోజుల పాటు మనీష్ సిసోడియాను ప్రశ్నించేందుకు సీబీఐ సిద్దమైంది. మరోవైపు సిసోడియా అరెస్ట్‌ను ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు పలు విపక్ష పార్టీలు ఖండిస్తున్నాయి. కేంద్రం దర్యాప్తు సంస్థలను గుప్పిట్లో పెట్టుకుని.. వారికి వ్యతిరేకంగా గళం వినిపించేవారిపై కుట్రపూరితంగా వ్యహరిస్తుందని ఆరోపిస్తున్నాయి. ఇక, మనీష్ సిసోడియా అరెస్ట్‌కు వ్యతిరేకంగా ఆప్ శ్రేణులు.. ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల్లో నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారు.