పోలీసుల తీరు అభ్యంతరకరం.. అధికాపార్టీల మెప్పుకు తాపత్రయం: సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

By telugu teamFirst Published Aug 26, 2021, 12:59 PM IST
Highlights

పోలీసులపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. కొందరు పోలీసులు అధికారపక్షంవైపు నిలబడుతున్నారని, ఈ పక్షపాత ధోరణి అభ్యంతరకరమని తెలిపింది. పోలీసులు కచ్చితంగా చట్టానికి లోబడి నడుచుకోవాలని స్పష్టం చేసింది.

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. పోలీసుల తీరు అభ్యంతరకరంగా మారుతున్నదని తెలిపింది. అధికార పార్టీ అండ కోసం పాకులాడుతున్నారని కటువుగా కామెంట్ చేసింది. అధికారపక్షాల వైపు పక్షపాతం వహిస్తారని, తర్వాత మరోపార్టీ అధికారంలోకి వచ్చాక వారు పోలీసులను టార్గెట్ చేసుకుంటున్నారని తెలిపింది. ఇది అభ్యంతరకర సంప్రదాయంగా పరిణమించిందని వ్యాఖ్యలు చేసింది. చాలా రాష్ట్రాల్లో రాజకీయ ప్రేరేపిత దర్యాప్తులు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్న తరుణంలో సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది.

‘రూలింగ్ పార్టీకి సానుకూలురైన జాబితాలో ఉండాలని తాపత్రయ పడే పోలీసులు అధికారాన్ని దుర్వినియోగం చేస్తారు. రాజకీయ ప్రత్యర్థులను వేధిస్తారు’ అని సంచలన వ్యాఖ్యలు చేసింది. తర్వాత ప్రత్యర్థ పార్టీ అధికారంలోకి వచ్చాక వారు పోలీసులను టార్గెట్ చేసుకుంటున్నారని వివరించింది. ఈ అభ్యంతరకర ధోరణికి పోలీసులదే బాధ్యత అని స్పష్టం చేసింది. అంతేకాదు, పోలీసులు కచ్చితంగా చట్టానికి లోబడి నడుచుకోవాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సారథ్యంలోని ధర్మాసనం హితవు పలికింది. ఈ ధోరణులను అన్నిపక్షాలు ఆపేయాలని సూచించింది. ఛత్తీస్‌గడ్‌కు చెందిన ఓ ఐపీఎస్ అధికారి పిటిషన్‌ విచారిస్తూ అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. 

ఐపీఎస్ గుర్జిందర్ పాల్ సింగ్‌పై దేశద్రోహం కేసు నమోదైంది. ఉద్యోగం నుంచి సస్పెండ్ అయ్యారు. ఆయనపై అవినీతి, ఛత్తీస్‌గడ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర చేశారన్న అభియోగాలతో ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. ఆ ఎఫ్ఐఆర్‌లను కొట్టేయాలని ఆదేశించాల్సిందిగా సదరు అధికారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గుర్జిందర్ పాల్ సింగ్‌ను అరెస్ట్ చేయవద్దంటూ కోర్టు ఛత్తీస్‌గడ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

click me!