రాజద్రోహం చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై మే 5న తుది విచారణ: స్పష్టం చేసిన సుప్రీం కోర్టు

Published : Apr 27, 2022, 03:32 PM IST
రాజద్రోహం చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై మే 5న తుది విచారణ: స్పష్టం చేసిన సుప్రీం కోర్టు

సారాంశం

IPCలోని సెక్షన్ 124A (రాజద్రోహం) రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌లను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి  జస్టిస్ ఎన్వీ రమణ, న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. 

రాజద్రోహం చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై తుది విచారణ మే 5వ తేదీన జరుగుతుందని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు తెలిపింది. IPCలోని సెక్షన్ 124A (రాజద్రోహం) రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌లను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి  జస్టిస్ ఎన్వీ రమణ, న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. స్వాతంత్య్ర ఉద్యమాన్ని అణిచివేసేందుకు మహాత్మా గాంధీ వంటి వారి నోరు మూయించేందుకు బ్రిటిష్ వారు ఉపయోగించిన నిబంధనను ఎందుకు రద్దు చేయడం లేదని సుప్రీంకోర్టు గత ఏడాది కేంద్రాన్ని ప్రశ్నించింది.

ఇక, బుధవారం విచారణ సందర్భంగా.. సెక్షన్ 124ఏ రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై స్పందించేందుకు సమయం కావాలని కేంద్ర ప్రభుత్వం  సుప్రీంకోర్టుకు తెలిపింది. కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ.. ప్రభుత్వం రాతపూర్వక సమాధానానికి సిద్ధంగా ఉందని.. అవసరమైన దిద్దుబాట్లు చేసిన తర్వాత రెండు రోజుల్లో దాఖలు చేస్తుందని చెప్పారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. వారం చివరిలోగా సమాధానం ఇవ్వాలని కేంద్రానికి గడువు ఇచ్చింది. 

మరోవైపు ఈ అంశంపై అనేక పిటిషన్లు ఉన్నందున.. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ తమ వాదనలకు నాయకత్వం వహించేందుకు పిటిషనర్లు అంగీకరించారు. వివిధ పిటిషన్లను పరిశీలించి తదనుగుణంగా సమర్పణలు చేస్తానని కపిల్ సిబల్ చెప్పారు. ఇక, ఇందుకు సంబంధించి మే 5వ తేదీన తుది విచారణ ఉంటుందని.. ఎటువంటి వాయిదాలు ఉండబోవని జస్టీస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. మే 5న తుది పరిష్కారానికి ఈ అంశాన్ని జాబితా చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ వ్యవహారంలో అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కూడా కోర్టుకు సహకరించనున్నారు.

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?