నోయిడాలో 40 అంతస్తుల ట్విన్ టవర్స్ కూల్చివేయండి: సుప్రీంకోర్టు ఆదేశం

By narsimha lodeFirst Published Aug 31, 2021, 3:40 PM IST
Highlights

నోయిడాలోని 40 అంతస్తుల ట్విన్ టవర్స్ ను కూల్చివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మూడు మాసాల్లో ట్విన్ టవర్స్ కూల్చివేత ప్రక్రియ పూర్తి చేయాలని కోరింది. నిపుణుల పర్యవేక్షణలో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని కోరింది. 

న్యూఢిల్లీ:ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడాలో నిబంధనలకు విరుద్దంగా నిర్మించిన 40 అంతస్థుల ట్విన్ టవర్స్ ను కూల్చివేయాలని సుప్రీంకోర్టు మంగళవారం నాడు ఆదేశించింది. మూడు మాసాల్లో ఈ ట్విన్ టవర్స్ కూల్చివేత ప్రక్రియ పూర్తి చేయాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయమై అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు సమర్ధించింది.

సూపర్ టెక్ సంస్థ ఈ ట్విన్ టవర్స్ ను నిర్మించింది. ఈ ట్విన్ టవర్స్ లో ప్లాట్స్ కొనుగోలు చేసిన వారికి 12 శాతం వడ్డీతో కలిపి డబ్బులను తిరిగి చెల్లించాలని సుప్రీంకోర్టు  ఆదేశించింది.జస్టిస్ చంద్రఛూడ్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం నాడు ఈ తీర్పును ఇచ్చింది. నిపుణుల పర్యవేక్షణలో జంట భవనాలను కూల్చివేయాలని ఆదేశించింది. ఈ  ట్విన్ టవర్స్ లో 915 ఫ్లాట్స్, దుకాణాలున్నాయి. నోయిడా అధారిటీని సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టింది,. పర్యావరణ పరిరక్షణ, నివాసితుల భద్రత విషయంలో భవన నిర్మాణదారులు నిబంధనలను ఉల్లంఘించారని కోర్టు అభిప్రాయపడింది.

భద్రతా ప్రమాణాలను  భవన నిర్మాణదారులు అతిక్రమించారని కోర్టు అభిప్రాయపడింది. నోయిడా అధికారులు ఇచ్చిన  అనుమతి నిబంధనలను కూడ   ఈ సంస్థ ఉల్లంఘించిందని కోర్టు తేల్చి చెప్పింది. రెంటు టవర్స్ మధ్య కనీస దూరం కూడ నిబంధనలకు అనుగుణంగా లేదని  కోర్టు తేల్చి చెప్పింది. ఫైర్ సేఫ్టీ నిబంధనలు కూడా ఉల్లంఘించినట్టుగా కోర్టు తెలిపింది.

ఈ ట్విన్ టవర్స్ ను నిర్మించిన సూపర్ టెక్ కంపెనీ తరపున న్యాయవాది మాత్రం భవన నిర్మాణంలో ఎలాంటి నిబంధనలను ఉల్లంఘించలేదని వాదించారు. ట్విన్ టవర్స్ నిర్మాణానికి కనీస దూరాన్ని పాటించినట్టుగా సూపర్ టెక్ సంస్థ న్యాయవాది వికాస్ సింగ్ చెప్పారు. అంతేకాదు భద్రతా ప్రమాణాలను కూడ పాటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

click me!