
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ శుక్రవారం పదవీ విరమణ పొందారు. ఈ రోజు ఆయనకు సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ వీడ్కోలు పలికింది. 2016 మే 13న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ అనేక కీలక కేసు తీర్పుల్లో ధర్మాసనం సభ్యుడిగా ఉన్నారు. ఈ ఆరు నెలలు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ ప్రధానమైన కేసులను విచారించారు. ఆయన ప్రస్తుతం సుప్రీంకోర్టులో రెండో అత్యంత సీనియర్ జడ్జీగా రికార్డుల్లో ఉన్నది.
గత నెల జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ ఉన్న బెంచ్‌లు రెండు కీలక విషయాలపై విచారించింది. ఒకటి 2002 గుజరాత్ అల్లర్లలో ప్రధాని మోడీ పాత్ర ఉన్నదని నమోదైన పిటిషన్‌ను విచారించింది. అలాగే, తాజాగా, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ చట్టం ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు స్వేచ్ఛ ఇచ్చిన సంచలన తీర్పు కూడా జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ ఉన్న బెంచ్ ఇచ్చింది. అంతకు ముందు విద్వేష ప్సంగాలు ఆపడం, కరోనా మహమ్మారి కాలంలో బోర్డ్ ఎగ్జామ్స్ నిర్వహించకుండా ఆదేశాలు జారీ చేశారు.
1957 జులై 30న పూణెలో జన్మించిన ఏఎం ఖాన్విల్కర్ ముంబయి లా కాలేజీ నుంచి ఎల్ఎల్‌బీ చేశారు. 1982లో అడ్వకేట్‌గా ఎన్‌రోల్ అయ్యారు. 2000 మార్చి 29న బాంబే హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా పదవి స్వీకరించారు.
2013 ఏప్రిల్ 4న హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆయన పదోన్నతి పొందారు. ఆ తర్వాత 2013 నవంబర్ 24న మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందించారు. 2016 మే 13న ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.