మోడీ ఎన్నిక చెల్లదు.. మాజీ జవాన్ పిటిషన్: కొట్టేసిన సుప్రీం

By Siva KodatiFirst Published Nov 24, 2020, 4:22 PM IST
Highlights

తన నామినేషన్‌ పత్రాలను ఎన్నికల కమిషన్‌ తప్పుగా తిరస్కరించిందంటూ తేజ్‌ బహదూర్‌ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశారు. దీంతో మోడీ ఎన్నిక కూడా చెల్లదని పిటిషన్‌లో పేర్కొన్నారు. 

ప్రధాని నరేంద్రమోడీ ఎన్నికకు సంబంధించి దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. బీఎస్ఎఫ్ జవానుగా పనిచేసిన తేజ్ బహదూర్ గతేడాది సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మోడీపై పోటీకి సిద్ధమయ్యారు.

దీనిలో భాగంగా సమాజ్ వాదీ పార్టీ తరపున నామినేషన్ దాఖలు చేశారు. అయితే, తప్పుడు సమాచారం కారణంగా ఎన్నికల అధికారి ఈయన నామినేషన్‌ను తిరస్కరించారు.

తన నామినేషన్‌ పత్రాలను ఎన్నికల కమిషన్‌ తప్పుగా తిరస్కరించిందంటూ తేజ్‌ బహదూర్‌ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశారు. దీంతో మోడీ ఎన్నిక కూడా చెల్లదని పిటిషన్‌లో పేర్కొన్నారు.

అయితే, ఎన్నికల అధికారి నిర్ణయాన్ని సమర్థించిన కోర్టు, తేజ్‌ బహదూర్‌ పిటిషన్‌ను తిరస్కరించింది. తేజ్ బహదూర్ లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థి కాదని, దీంతో గెలుపొందిన వ్యక్తి ఎన్నికను సవాలు చేసే అర్హత ఆయనకు లేదని అలహాబాద్‌ హైకోర్టు అభిప్రాయపడింది.

దీనిని సవాల్ చేస్తూ తేజ్ బహదూర్‌‌ సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకున్నాడు. ఇప్పటికే ఆయన పిటిషన్‌ను కొట్టివేస్తూ అలహాబాద్‌ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది.

అప్పీలులో భాగంగా పూర్తి విచారణ అనంతరం, తీర్పు రిజర్వులో ఉంచిన భారత ప్రధానన్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం తాజాగా ఈ నిర్ణయాన్ని వెలువరించింది.  

మరోవైపు గతంలో బీఎస్ఎఫ్‌లో పనిచేస్తున్న సమయంలో తేజ్‌ బహదూర్‌ విడుదల చేసిన వీడియో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. సైనికులకు నాసిరకం ఆహారం ఇస్తున్నారని ఆరోపిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. ఇది అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు తేజ్ బహదూర్‌ను సస్పెండ్ చేశారు. 

click me!