
రాజస్థాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇందిరా మీనా బుధవారం నాడు ట్రాక్టర్ నడిపి రైతు ఆందోళనలకు మద్ధతుగా నిలిచారు. ఇలా ట్రాక్టర్ నడుపుతూ ఆమె అసెంబ్లీకి చేరుకున్నారు. మహిళా ఎమ్మెల్యే ట్రాక్టర్ నడుపుతూ అసెంబ్లీకి రావడంతో జనంలో, పార్టీ కార్యకర్తల్లో ఎంతో ఉత్సుకత కనిపించింది.
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో జరుగుతున్న రైతుల ఆందోళనకు కాంగ్రెస్ పార్టీతో పాటు పలు రాజకీయ పార్టీలు ఇప్పటికే మద్ధతు ప్రకటించాయి. రాజస్తాన్ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కేంద్ర సాగు చట్టాలు తిరస్కరిస్తూ అసెంబ్లీలో బిల్లు కూడా కూడ ఆమోదించింది.
కాగా, రైతు ర్యాలీలను ఉద్దేశించి ప్రసంగించేందుకు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శుక్రవారంనాడు రాజస్థాన్‌కు రానుండటంతో పార్టీ కార్యకర్తల్లోనూ సందడి కనిపిస్తోంది. పనిలో పనిగా ఉత్తరప్రదేశ్ లోనూ కేంద్ర సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతు ఆందోళనకు మద్దతిచ్చేందుకు నిరసన కార్యక్రమాలు కాంగ్రెస్ వ్యూహరచన చేస్తోంది.
పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఉత్తరప్రదేశ్ పార్టీ ఇన్ ఛార్జి ప్రియాంక గాంధీ వాద్రా యూపీలో చేపట్టే నాలుగు రోజుల నిరసన కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.