నేవీలో 30 ఏళ్ల సేవలు, తుక్కుగా ఐఎన్ఎస్ విరాట్.. సుప్రీం స్టే

By Siva KodatiFirst Published Feb 10, 2021, 3:24 PM IST
Highlights

దాదాపు మూడు దశాబ్దాల పాటు ఇండియన్ నేవీలో సేవలందించిన విమాన వాహన నౌక ఐఎన్‌ఎస్‌ విరాట్‌ను విచ్ఛిన్నం చేసే ప్రక్రియపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఎన్నో ఆపరేషన్లలో పాల్గొన్న ఈ యుద్ధ నౌకను కొనుగోలు చేసి సముద్ర మ్యూజియంగా మార్చాలనుంకుంటున్నట్లు ఓ ప్రైవేటు సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది

దాదాపు మూడు దశాబ్దాల పాటు ఇండియన్ నేవీలో సేవలందించిన విమాన వాహన నౌక ఐఎన్‌ఎస్‌ విరాట్‌ను విచ్ఛిన్నం చేసే ప్రక్రియపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఎన్నో ఆపరేషన్లలో పాల్గొన్న ఈ యుద్ధ నౌకను కొనుగోలు చేసి సముద్ర మ్యూజియంగా మార్చాలనుంకుంటున్నట్లు ఓ ప్రైవేటు సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

దీనిపై విచారణ జరిపిన సీజేఐ జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం.. నౌకను విచ్ఛిన్నం చేసే ప్రక్రియను నిలిపివేయాలని ఆదేశించింది. అలాగే పిటిషన్‌పై తమ స్పందన తెలియజేయాలంటూ కేంద్ర ప్రభుత్వం, నౌకను కొనుగోలు చేసిన మరో సంస్థకు నోటీసులు జారీ చేసింది.  

కాగా, 29 ఏళ్ల పాటు సేవలందించిన ఐఎన్‌ఎస్‌ విరాట్‌ జీవనకాలం పూర్తవడంతో 2017 మార్చిలో నేవీ దీన్ని ఉపసంహరించింది. తొలుత దీన్ని మ్యూజియంగా మార్చాలని ఆంధప్రదేశ్‌ ప్రభుత్వం భావించి తీవ్ర ప్రయత్నాలు చేసింది.

అయితే ఆ ప్రణాళికలు ఫలించకపోవడంతో దీన్ని తుక్కుగా మార్చి విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా విరాట్‌ను శ్రీరాం షిప్‌ బ్రేకర్స్‌ అనే సంస్థకు విక్రయించింది.. దీంతో సదరు కంపెనీ ఈ నౌకను గుజరాత్‌లోని అలంగ్‌ తీరానికి తీసుకొచ్చింది.

ఇప్పటికే నౌకలోని కొంతభాగాన్ని నిర్వీర్యం చేశారు. అయితే ఈ యుద్ధనౌకను మ్యూజియంగా మార్చాలని భావిస్తున్న ఎన్విటెక్‌ అనే సంస్థ నౌకను కొనుగోలు చేసేందు ముందుకొచ్చి తన ప్రతిపాదన తెలియజేసింది.

అయితే ఎన్విటెక్ ప్రయత్నాలకు రక్షణశాఖ నుంచి ఆటంకాలు ఎదురయ్యాయి. డిఫెన్స్ శాఖ నుంచి ఎన్ఓసీ రాకపోవడంతో ఆ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ కాలం యుద్ధ రంగంలో సేవలందించిన నౌకగా విరాట్ గుర్తింపు  తెచ్చుకుంది. 60 ఏళ్ల ఘన చరిత గల విరాట్‌.. 1959లో బ్రిటిష్‌ రాయల్‌ నేవీలో చేరింది.

ఆ తర్వాత 1984లో దీన్ని ఉపసంహరించి భారత్‌కు విక్రయించారు. 1982 లో దక్షిణ అట్లాంటిక్‌లోని ఫాక్లాండ్‌ దీవుల్లో జరిగిన యుద్ధంలో అద్భుతమైన సేవలు అందించింది. 1987లో భారత నౌకాదళంలో చేరిన విరాట్‌.. దాదాపు 30ఏళ్ల పాటు సుదీర్ఘ సేవలందించింది.

విరాట్‌ను కేంద్ర ప్రభుత్వం అనుకున్న ప్రకారం విచ్ఛిన్నం చేస్తే.. భారత్‌లో నిర్వీర్యం అవుతున్న రెండో యుద్ధ నౌకగా నిలవనుంది. అంతకుముందు 2014లో ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ను తుక్కుగా చేసిన సంగతి తెలిసిందే. 

click me!