హిమాచల్ ప్రదేశ్ నూతన సీఎంగా సుఖ్వీందర్ సింగ్ ప్రమాణ స్వీకారం.. హాజరైన ఖర్గే, రాహుల్, ప్రియాంక..

By Sumanth KanukulaFirst Published Dec 11, 2022, 2:36 PM IST
Highlights

హిమాచల్ ప్రదేశ్ 15వ ముఖ్యమంత్రిగా సుఖ్వీందర్ సింగ్ సుఖు ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ప్రమాణ స్వీకారం చేయించారు.

హిమాచల్ ప్రదేశ్ 15వ ముఖ్యమంత్రిగా సుఖ్వీందర్ సింగ్ సుఖు ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే హిమాచల్ ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ నేత ముఖేష్ అగ్నిహోత్రి ప్రమాణ స్వీకారం చేశారు. షిమ్లాలోని చారిత్రక రిడ్జ్ మైదానంలో జరిగిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ నేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా, కాంగ్రెస్ హిమాచల్ ప్రదేశ్ ఇన్‌ఛార్జ్ రాజీవ్ శుక్లా, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ ప్రతిభా సింగ్, సీనియర్ నాయకుడు సచిన్ పైలట్ హాజరయ్యారు. 

ఈ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మేము చాలా సంతోషంగా ఉన్నాము’’ అని చెప్పారు. తాము వాగ్దానం చేసినవాటిని వీలైనంత త్వరగా అమలు చేయాలనుకుంటున్నామని చెప్పారు. 

సుఖ్వీందర్ సింగ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైందుకు షిమ్లా చేరుకున్న రాహుల్ గాంధీకి రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ ప్రతిభా వీరభద్ర సింగ్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాహుల్‌తో మాట్లాడుతూ.. ‘‘మనం హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ను తిరిగి అధికారంలోకి తీసుకురాగలుగుతామని మేము హామీ ఇచ్చాము’’ అని చెప్పారు. దీనిపై స్పందించిన రాహుల్ గాంధీ.. అభినందనలు చెప్పారు. 

ఇక, హిమాచల్ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 12న జరగగా.. డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 40 స్థానాలను కైవసం చేసుకుని విజయం సొంతం చేసుకుంది. బీజేపీ నుంచి అధికారాన్ని చేజిక్కించుకుంది. ఇక, శనివారం జరిగిన పార్టీ శాసనసభపక్ష సమావేశం అనంతరం.. సీఎంగా సుఖ్వీందర్ సింగ్ సుఖు బాధ్యతలు చేపట్టనున్నారని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. 

సుఖ్వీందర్ సింగ్ సుఖు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. అలాగే కాంగ్రెస్ రాష్ట్ర ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్‌గా వ్యవహరించారు. ఇక, తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముందు ప్రతిభా సింగ్‌ను కలిసి సుఖ్వీందర్ సింగ్ సుఖు పార్టీ నేతల మధ్య ఐక్యతను ప్రదర్శించారు.  

click me!