సీబీఐ డైరెక్టర్ గా సుభోద్ జైశ్వాల్

By telugu news teamFirst Published May 26, 2021, 8:08 AM IST
Highlights

బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ మంగళవారం తెలిపింది

సీబీఐ( కేంద్ర దర్యాప్తు సంస్థ) కొత్త డైరెక్టర్ గా మహారాష్ట్ర కేడర్ కు చెందిన ఐపీఎస్ అధికారి సుభోద్ కుమార్ జైశ్వాల్ నియమితులయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, లోక్ సభలో విపక్ష నేత అధీర్ రంజన్ చౌధురీలరతో కూడిన త్రిసభ్య కమిటీ 109 మంది జాబితా నుంచి వడపోసి జైశ్వాల్ ని ఎంపిక చేసింది.

బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ మంగళవారం తెలిపింది. ఫిబ్రవరిలో రిషికుమార్ శుక్లా పదవీ విరమణ చేయడంతో... మూడు నెలలుగా సీబీఐ పూర్తిస్థాయి డైరెక్టర్ లేకుండానే నడుస్తోంది. 

1962 సెప్టెంబర్ 22న జైశ్వాల్ జన్మించారు. ఆక్ష్న 1985 వ ఐపీఎస్ బ్యాచ్ కి చెందిన వారు. ప్రస్తుతం కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం( సీఐఎస్ఎఫ్) డైరెక్టర్ జనరల్ గా వ్యవహరిస్తున్నారు. కేంద్రంలో అత్యంత కీలకమైన రీసర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ లో కూడా జైశ్వాల్ కు 9 సంవత్సరాల అనుభవం ఉంది.

ఈ ఏడాది జనవరిలో డిప్యుటేషన్ మీద కేంద్ర సర్వీసులకు వచ్చారు. సీబీఐ డైరెక్టర్ పదవికి షార్టు లిస్ట్ చేసిన బిహార్ కేడర్ కు చెందిన ఎస్ఎస్ బీ డైరెక్టర్ జనరల్ కుమార్ రాజేష్ చంద్ర, ఏపీ కేడర్ అధికారి వీఎస్ కే కౌముంది కంటే  జైశ్వాల్ అత్యంత సీనియర్ కావడం గమనార్హం. అందుకే.. ఆ బాధ్యతలు ఆయనకు అప్పగించారు.

గతంలో ఆయన మహారాష్ట్ర డీజీపీగా, దేవేంద్ర ఫడణవీస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముంబయి పోలీస్ కమిషనర్ గా పనిచేశారు. ఎస్పీజీ, ముంబయి యాంటీ టెర్రరిజం స్క్వాడ్, మహారాష్ట్ర స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం, స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ లోనూ సేవలు అందించారు.

అప్పట్లో సంచలనం సృష్టించిన తెల్గీ స్కామ్ ను కూడా ఈయనే దర్యాప్తు చేశారు. మహారాష్ట్రలో వామపక్ష తీవ్రవాద ప్రభావం అధికంగా ఉన్న గడ్చిరోలీ జిల్లాలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు.

click me!