
రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర సర్కార్ సంచలన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో ఆంక్షలపై ఏకాభిప్రాయం కోసం తీవ్రంగా శ్రమిస్తోంది.
కొన్ని చోట్ల లాక్‌డౌన్ విధించడంపై ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో కఠిన నిర్ణయాల అమలు విషయంలో వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. ఏకాభిప్రాయం కోసం సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, ప్రొడ్యూసర్లు తదితరులతో ఆదివారం భేటీ కానున్నారు.
మొదట సినీ పరిశ్రమ ప్రముఖులతో భేటీ కానున్నారు. ఆ తర్వాత పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలతో భేటీ కానున్నారు. అయితే సీఎం సన్నిహిత వర్గాలు మాత్రం రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించే అవకాశం ఉందని స్పష్టంగా పేర్కొంటున్నారు.
ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు కేబినెట్ భేటీ జరగబోతోంది. ఈ భేటీ తర్వాతే కఠినమైన నిర్ణయాలను వెల్లడించే అవకాశాలున్నట్లు కొందరు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు మల్టీప్లెక్స్, జిమ్‌లు, హెల్త్‌క్లబ్, సినిమా హాల్ ఓనర్లతో సీఎం ఉద్ధవ్ వర్చువల్ మీట్ నిర్వహించారు.
అయితే వీటన్నింటినీ మూసివేసే అవకాశాలున్నట్లు సమాచారం. లేని పక్షంలో మధ్యేమార్గంగా సందర్శకులపై పరిమితులు విధించే అవకాశం వుంది. ఏం నిర్ణయం తీసుకుంటారనే దానిపై మరికొద్దిసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం వుంది.