హత్రాస్ ఘటన: ప్రియాంక, రాహుల్‌లను అడ్డుకున్న పోలీసులు, ఉద్రిక్తత

By Siva KodatiFirst Published Oct 1, 2020, 2:36 PM IST
Highlights

ఉత్తరప్రదేశ్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. హత్రాస్ అత్యాచార బాధితురాలి కుటుంబసభ్యులను పరామర్శించేందుకు బయల్దేరిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని యూపీ పోలీసులు అడ్డుకున్నారు.

ఉత్తరప్రదేశ్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. హత్రాస్ అత్యాచార బాధితురాలి కుటుంబసభ్యులను పరామర్శించేందుకు బయల్దేరిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని యూపీ పోలీసులు అడ్డుకున్నారు.

దీంతో ఆమె కాన్వాయ్ దిగి రాహుల్ గాంధీతో కలిసి నడక ప్రారంభించారు. పోలీసులు అడ్డుకున్నా సరే వెళ్లి తీరతానంటూ తేల్చి చెప్పారామె. మృతురాలి కుటుంబాన్ని గృహ నిర్బంధంలో ఉంచారని, కనీసం కన్నబిడ్డ చివరి చూపు దక్కకుండా చేశారని ప్రియాంక ఆరోపించారు.

యూపీలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆమె ఫైరయ్యారు. మరోవైపు హత్రాస్ ఘటనపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు, ప్రజా సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. యూపీలో యోగి సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.

నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అటు ఈ ఘటనపై ముగ్గురు సభ్యుల సిట్ బృందం దర్యాప్తు ప్రారంభించింది. వారం రోజుల్లో సిట్ బృందం నివేదిక సమర్పించాల్సి వుంది.

మరోవైపు హత్రాస్ సరిహద్దులను పోలీసులు మూసివేశారు. అక్కడ 144 సెక్షన్ విధించారు. అటు మృతురాలి పోస్ట్‌మార్టం నివేదికలో దారుణమైన విషయాలు బయటపడ్డాయి. అత్యాచారం చేసి ఆ తర్వాత దారుణంగా హింసించి చంపినట్లు రిపోర్టులో వెల్లడైంది.

మరోవైపు బీఎస్పీ అధినేత్రి మాయావతి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వెంటనే యోగి ఆదిత్యనాథ్ ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ పదవి నుంచి తప్పుకోవాలని, లేదంటే రాష్ట్రపతి పాలన విధించాలని ఆమె డిమాండ్ చేశారు. 

click me!