గల్లా జయదేవ్ పై స్పీకర్ ఆగ్రహం: కల్వకుంట్ల కవితకు నో

Published : Jul 20, 2018, 12:10 PM IST
గల్లా జయదేవ్ పై స్పీకర్ ఆగ్రహం: కల్వకుంట్ల కవితకు నో

సారాంశం

కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపాదించిన అవిశ్వాసం తీర్మానంపై చర్చలో టీడీపి సభ్యుడు గల్లా జయదేవ్ పై స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గల్లా జయదేవ్ కు అడ్డు తగిలి ప్రసంగాన్ని ముగించాలని ఆమె సూచించారు.

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపాదించిన అవిశ్వాసం తీర్మానంపై చర్చలో టీడీపి సభ్యుడు గల్లా జయదేవ్ పై స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గల్లా జయదేవ్ కు అడ్డు తగిలి ప్రసంగాన్ని ముగించాలని ఆమె సూచించారు. 

మీకు ఎంత సమయం కేటాయించానని ఆమె ప్రశ్నించారు. తనకు మరింత సమయం కావాలని గల్లా సమాధానమిచ్చారు. అలా కుదరదని స్పీకర్ స్పష్టం చేశారు. మరో 5నిమిషాల్లో ముగించాలని సూచించారు. గతంలో అవిశ్వాసంపై చర్చ జరిగినప్పుడు గంట కంటే తక్కువగా ఎవరూ చర్చ జరపలేదని, తాను రికార్డులను పరిశీలించే మాట్లాడుతున్నానని గల్లా చెప్పారు.

చరిత్ర గురించి మాట్లాడటం కాదని, వర్తమానం గురించి మాట్లాడాలని ఆమె గల్లా జయదేవ్ తీరు పట్ల అసహనం వ్యక్తం చేశారు. ప్రసంగాన్ని ముగించాలని స్పీకర్ పదే పదే కోరినప్పటికీ గల్లా జయదేవ్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ వెళ్లారు.

ఇదిలా వుంటే, గల్లా జయదేవ్ ప్రసంగంపై ఒక సందర్భంలో తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని అప్రజాస్వామికంగా విభజించారని గల్లా జయదేవ్ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎంపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. విభజన తర్వాత కొత్త రాష్ట్రం ఏపీనే అని అన్నారు. 

మందబలంతో, వివక్షతో అన్యాయంగా గొంతునొక్కి విభజన బిల్లును ఆమోదించారని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణకు ఆస్తులిచ్చి.. ఏపీకి మాత్రం అప్పులు ఇచ్చారని అన్నారు.  ఈ వ్యాఖ్యలపై కూడా టీఆర్ఎస్ ఎంపీలు అభ్యంతరం తెలిపారు. తమ స్థానాల్లో నిలబడి నిరసన తెలిపారు. 

ఈ సమయంలో ఎంపీ కవిత సీటులో నుంచి లేచి మాట్లాడేందుకు ప్రయత్నించారు. ఇది సరైన సమయం కాదని అవకాశం వచ్చినప్పుడు మాట్లాడాలని స్పీకర్ సుమిత్రా మహాజన్ తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu