బ్రేకింగ్: కరోనా బారినపడ్డ ఎస్పీ అధినేత ములాయంసింగ్ యాదవ్

By Arun Kumar PFirst Published Oct 15, 2020, 7:56 AM IST
Highlights

 దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. తాజాగా ఈ వైరస్ బారినపడి జాతీయస్థాయి రాజకీయ నాయకులొకరు హాస్పిటల్లో చేరారు. 

లక్నో: ఉత్తరప్రదేశ్ రాజకీయ కురువృద్దుడు, సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయంసింగ్ యాదవ్ కరోనా బారినపడ్డారు. ఎలాంటి కరోనా లక్షణాలు లేకపోయినప్పటికి తన తండ్రికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయినట్లు యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ వెల్లడించారు. పాజిటివ్ గా తేలినా ఆయన ఆరోగ్యంగానే వున్నారని... గురుగ్రామ్ లోని మేదాంత హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారని అఖిలేష్ వెల్లడించారు. 

ములాయం ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే వుందని... ఎప్పటికప్పుడు ఆయన పరిస్థితికి కుటుంబసభ్యులకు తెలియజేస్తున్నామని డాక్టర్లు వెల్లడించారు. అయితే ఆయన వయసును దృష్టిలో వుంచుకుని సమాజ్ వాది నాయకులు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. తమ నాయకుడు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగిరావాలని వారు కోరుకుంటున్నారు. 

మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పడుతుండటంతో ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే ఈ మహమ్మారిపై మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన అన్నారు. వైరస్ ముప్పు మనల్ని ఇంకా వెంటాడుతూనే ఉన్నందున భౌతిక దూరం పాటించడం వంటి కోవిడ్ 19 నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ప్రధాని తెలిపారు.  

కరోనా నిబంధనల విషయంలో ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించరాదని ఆయన కోరారు. మహారాష్ట్రలో పరిస్ధితి కొంత ఆందోళనకరంగా ఉందని, వ్యాక్సిన్ వచ్చే వరకు జాగ్రత్తగా ఉండాలని మోడీ విజ్ఞప్తి చేశారు.

click me!