
UP Assembly Election 2022: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఈ ఎన్నికలు మినీ సంగ్రామాన్ని తలపిస్తున్నాయి. ఇక ఉత్తరప్రదేశ్ లో ఇప్పటికే పలు దశల ఎన్నికలు పూర్తయిన క్రమంలో రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. విమర్శలు, ఆరోపణలతో విరుచుకుపడుతుండటంతో రాజకీయాలు కాక రేపుతున్నాయి. రాష్ట్రం (Uttar Pradesh) లో మళ్లీ అధికారం దక్కించుకోవాలని బీజేపీ గట్టిగా ప్రయత్నాలు చేస్తుండగా, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీ సైతం తనదైన స్టైల్ లో ప్రచారం కొనసాగిస్తూ.. అధికార పీఠం దక్కించుకోవాలని చూస్తుంది.
ఈ నేపథ్యంలోనే హర్ధోయ్ లో జరిగిన ఎన్నికల ప్రచారం ర్యాలీలో ప్రధాని మోడీ.. సమాజ్ వాదీ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సమాజ్ వాదీ పార్టీ, దాని ఎన్నికల గుర్తు అయిన సైకిల్‌పై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలకు స్పందించిన అఖిలేష్ యాదవ్.. మోడీకి గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన సైకిల్ గ్రామీణ భారతదేశానికి గర్వకారణం అంటూ పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల 3వ దశ పోలింగ్ కొనసాగుతున్న క్రమంలో హర్దోయ్‌లో జరిగిన ర్యాలీకి ప్రధాని మోడీ హాజరయ్యారు. అక్కడ 2008లో జరిగిన అహ్మదాబాద్ వరుస పేలుళ్ల గురించి మాట్లాడారు. ఆ దాడిలో 56 మంది ప్రాణాలు కోల్పోయారనీ, కోర్టు ఇటీవల దోషులకు మరణశిక్ష విధించిందని పేర్కొన్నారు. "అహ్మదాబాద్ పేలుళ్ల కేసు విచారణ జరుగుతున్నందున ఇన్నాళ్లు మౌనంగా ఉన్నాను. ఈ రోజు, కోర్టు వారికి శిక్ష విధించింది. ఈప్పుడు నేను దేశం ముందు ఈ అంశాన్ని లేవనెత్తుతున్నాను. పేలుళ్లలో, బాంబులను సైకిళ్లపై ఉంచారు... వారు [ఉగ్రవాదులు] ఎందుకు సైకిళ్లను ఎంచుకున్నారని నేను ఆశ్చర్యపోతున్నాను" అని మోడీ అన్నారు. ఎస్పీపై విమర్శలు గుప్పించారు.
ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై సమాజ్‌వాదీ పార్టీ అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తన పార్టీ చిహ్నాంపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ.. సైకిల్ గ్రామీణ భారతదేశానికి గర్వకారణం అని అన్నారు. ప్రధానమంత్రి వ్యాఖ్యలపై స్పందించిన అఖిలేష్ యాదవ్.. "మా సైకిల్ రైతులతో పొలాలను కలుపుతుంది. వారి శ్రేయస్సుకు పునాది వేస్తుంది. మా చక్రం సామాజిక సరిహద్దులను ఛేదిస్తుంది. కుమార్తెలను పాఠశాలకు పంపుతుంది" అంటూ ట్వీట్ చేశారు.
తన ట్వీట్ లో “మా చక్రం ద్రవ్యోల్బణంతో ప్రభావితం కాకుండా ఉంది. అది దాని స్వంత వేగంతో నడుస్తుంది. సైకిల్ అనేది సామాన్యుల విమానం. ఇది గ్రామీణ భారతదేశానికి గర్వకారణం. సైకిల్‌ను అవమానించడం మొత్తం దేశాన్ని అవమానించినట్లే. సైకిల్‌పై విమానం బొమ్మను పట్టుకుని వెళ్తున్న చిన్నారి చిత్రాన్ని కూడా అఖిలేష్ యాదవ్ షేర్ చేశారు. కాగా, ఉత్తరప్రదేశ్ మూడో దశ ఎన్నికలు ఆదివారం ముగిశాయి. మొత్తం 59 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరిగింది. 60 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. ఉత్తరప్రదేశ్‌లో నాలుగో దశ పోలింగ్ ఫిబ్రవరి 23న జరగనుండగా, ఓట్ల లెక్కింపు మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి.