
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఇంట విషాదం నెలకొంది. సోనియా గాంధీ తల్లి పావోలా మైనో ఆగస్టు 27న ఇటలీలో కన్నుమూసినట్లు కాంగ్రెస్ సీనియర్ నేత, కమ్యూనికేషన్స్ ఇన్‌ఛార్జ్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ ట్విట్టర్ వేదికగా బుధవారం తెలిపారు.
"శ్రీమతి సోనియా గాంధీ తల్లి, శ్రీమతి పావోలా మైనో 2022 ఆగస్టు 27వ తేదీ శనివారం ఇటలీలోని తన స్వగృహంలో కన్నుమూశారు. నిన్న (ఆగస్టు 30న) అంత్యక్రియలు జరిగాయి" అని జైరామ్ రమేష్ ట్వీట్ చేశారు.
90 ఏళ్ల వయసులో అనారోగ్యంతో ఉన్న తన తల్లిని పరామర్శించేందుకు కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆగస్టు 23న బయలుదేరి వెళ్లారు. సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా ఇప్పటికే విదేశాలలో ఉన్నారు. అంత్యక్రియలకు వారందరూ ఇటలీ వెళ్లినట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీకి పలువురు సంతాపం తెలుపుతున్నారు.