
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సోమవారం సాయంత్రం పార్టీకి చెందిన సీనియర్ నేతలతో సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో ప్రశాంత్ కిషోర్ అంశం చర్చించినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే సోనియా మరోమారు ప్రశాంత్ కిషోర్‌తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కొందరు కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా హాజరయ్యారు. అయితే ఆ సమావేశంలో రాహుల్ గాందీ పాల్గొనలేదు. అయితే ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్‌లో చేరతారా..?, 2024 జాతీయ ఎన్నికల్లో ఆయన పాత్ర ఏమిటన్నది..? కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నిర్ణయిస్తారని ఆ పార్టీ అగ్రనేతలు చెప్పారు. అన్ని విధాల చర్చల అనంతరం సోనియా తుది నిర్ణయం తీసుకుంటారని వారు అన్నారు.
ఇక, 2024 సార్వత్రిక ఎన్నికలు, త్వరలో పలు రాష్ట్రాల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన రోడ్ మ్యాప్‌పై కాంగ్రెస్ అధిష్టానం చర్చిస్తోంది. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న ప్రశాంత్ కిషోర్ విషయంలో తుది నిర్ణయం వెలువడే చాన్స్ ఉంది.
ఇక, నేడు(ఏప్రిల్ 19న) 10 జన్‌పథ్‌లోని సోనియా నివాసంలో ప్రశాంత్ కిషోర్‌తో మరో రౌండ్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో కమల్‌నాథ్, దిగ్విజయ్ సింగ్‌లతో పాటుగా పలువురు సీనియర్ నేతలు కూడా పాల్గొన్నారు. పీకే కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉందన్న ఊహాగానాల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. పీకే.. సోనియా గాంధీని కలవడం వారం వ్యవధిలో ఇది మూడోసారి. రాబోయే రోజుల్లో ఇలాంటివి మరో రెండు సమావేశాలు జరగవచ్చని వార్తా సంస్థ ANI మూలాలను ఉటంకిస్తూ నివేదించింది.
ఇక, ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్‌లో చేరనున్నారనే వార్తలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి. అయితే ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు చోటుచేసుకున్న పరిణామాలు గమనిస్తే ఆయన కాంగ్రెస్‌కు దరం జరిగినట్టుగా కనిపించింది. అయితే ఆ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత సంస్థాగతంగా పార్టీని దృష్టి సారించడంపై కాంగ్రెస్ ఫోకస్ చేసింది. ఈ క్రమంలోనే మరోమారు పీకేతో కాంగ్రెస్ పార్టీ చర్చలు ప్రారంభించింది.