సోహ్రబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసు: అమిత్ షా సహా 22 మంది నిర్దోషులే

By sivanagaprasad kodatiFirst Published Dec 21, 2018, 2:04 PM IST
Highlights

దేశవ్యాప్తంగా సంచలనం సృస్టించిన గుజరాత్ గ్యాంగ్ స్టర్ సోహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసులో బీజేపీ చీఫ్ అమిత్ షా సహా 22 మందిని నిర్దోషులుగా పేర్కొంటూ ముంబైలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం కీలక తీర్పును వెలువరించింది. 

దేశవ్యాప్తంగా సంచలనం సృస్టించిన గుజరాత్ గ్యాంగ్ స్టర్ సోహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసులో బీజేపీ చీఫ్ అమిత్ షా సహా 22 మందిని నిర్దోషులుగా పేర్కొంటూ ముంబైలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం కీలక తీర్పును వెలువరించింది.

నాటి గుజరాత్ సీఎం నరేంద్రమోడీ హత్యకు కుట్రపన్నడంతో పాటు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయనే అభియోగాలు ఎదుర్కొన్న గ్యాంగ్‌స్టర్ సోహ్రాబుద్దీన్ 2005 నవంబర్‌లో అహ్మాదాబాద్ సమీపంలో పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మరణించాడు.

అతను చనిపోయిన మూడు రోజులకు సోహ్రాబుద్దీన్ భార్య కౌసర్ బీ అనుమానాస్పద స్థితిలో మరణించింది. అతని అనుచరుడైన తులసీరాంను కూడా 2006 డిసెంబర్ 27న గుజరాత్-రాజస్థాన్ సరిహద్దులో ఎన్‌కౌంటర్‌కు గురయ్యాడు.

వీరందరిని పోలీసులు కుట్రపూరితంగా హతమార్చారంటూ సీబీఐ 2010లో ఛార్జీషీటు దాఖలు చేసింది. ఈ కేసులో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అప్పటి గుజరాత్ హోంమంత్రి, ప్రస్తుత బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాతో పాటు మరో 38 మందిపై సీబీఐ కేసు నమోదు చేసింది.

ఈ కేసులో అమిత్ షా కొన్ని నెలల పాటు జైలు శిక్ష అనుభవించారు. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును గుజరాత్ నుంచి ముంబై పోలీసులకు అప్పగించారు. నాడు సరైన ఆధారాలు లేవంటూ అమిత్ షాతో పాటు 16 మందిపై కేసును కొట్టివేయగా.. మిగిలిన 22 మందిని నేడు ముంబై ప్రత్యేక కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.

సోహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్ కుట్రపూరితంగా జరిగిందనడానికి తగిన ఆధారాలు లేవని న్యాయమూర్తి స్పష్టం చేశారు. 210 మంది సాక్షులను తీసుకొచ్చినప్పటికీ వారు చెప్పిన సమాధానాలు సంతృప్తికరంగా లేవని న్యాయస్థానం పేర్కొంది.

కాగా, సోహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసును విచారిస్తున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లోయా 2014లో అనుమానాస్పద స్థితిలో మరణించడం అప్పట్లో పెద్ద దుమారాన్ని రేపింది. అయితే ఆయనది సహజ మరణమేనని సర్వోన్నత న్యాయస్థానం తర్వాత స్పష్టం చేసింది. 

click me!